
- జూలై 26 నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎప్‌సెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు అలాటైన వారిలో 59,980 మంది సెల్ఫ్ రిపోర్టు చేశారని అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా బీటెక్ ఫస్టియర్‌లో మొత్తం 83,054 సీట్లుండగా.. 77,561 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. వారికి బుధవారం రాత్రి వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో 59,980 మంది రిపోర్టు చేశారని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. దీంతో, రెండో విడతకు 23,074 సీట్లు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించారు.
కంప్యూటర్ సైన్స్, ఐటీ వాటి అనుబంధ కోర్సుల్లో 13,944 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీఎస్ఈలో 6,960, సీఎస్ఈ ఏఐఎంఎల్ కోర్సులో 2,807 సీట్లు, ఈసీఈలో 3,253, ఈఈఈలో 2,169, సివిల్ లో 1,400, మెకానికల్ 1,630 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ నెల 26 నుంచి ఎప్‌సెట్ రెండో విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్ ప్రక్రియ కొనసాగనుందని అధికారులు ప్రకటించారు. ఈ నెల 30న సీట్ల అలాట్మెంట్ ఉంటుందన్నారు. వివరాలకు https://tgeapcet.nic.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు.