రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి

రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి

హైదరాబాద్‌, వెలుగు : వికారాబాద్ జిల్లా విద్యా మౌలిక వసతుల కల్పన (టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ) సైట్‌ ఇంజనీర్ ఇర్ఫాన్‌  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అతడు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. నవాబ్‌పేట్  మండలం మాదారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు, మన బడి’ కింద సివిల్ కాంట్రాక్టర్  ముష్టి ప్రభు రిపేరింగ్ పనులు చేశారు. వాటికి సంబంధించిన ఎస్టిమేషన్  కోసం జిల్లా విద్యా మౌలిక వసతుల కల్పన శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సైట్‌ ఇంజనీర్  ఇర్ఫాన్‌ను కలిశారు.

ఎస్టిమేషన్‌ చేసేందుకు ఇర్ఫాన్  లంచం డిమాండ్‌  చేశాడు. అప్పటికే అతను రూ.51 వేలు తీసుకున్నాడు. మళ్లీ కొంత డబ్బు ఇవ్వాలంటూ కొద్ది రోజులపాటు ఒత్తిడి పెంచాడు. రూ.5 వేలు ఇస్తానని ప్రభు అంగీకరించారు. తరువాత ప్రభు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో అధికారులు ట్రాప్‌ ప్లాన్  వేశారు. కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లోని పరిగి రోడ్డులో నిఘా పెట్టారు. ప్రభు నుంచి ఇర్ఫాన్  లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసి హైదరాబాద్‌ కు తరలించారు. అతడిని బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్‌పీ సూర్యనారాయణ వెల్లడించారు.