
9 మంది చనిపోతే.. ఇలాంటివి చాలా జరిగాయన్న సీఎండీ
సేఫ్టీ మెజర్స్ నుంచి రెస్క్యూ దాకా అన్నింటా ఫైయిల్
ప్రమాదంపై జవాబు లేని ప్రశ్నలెన్నో యూనిట్ ఆటో షట్‌డౌన్ ఎందుకు కాలేదు? ఫైర్ ఎగ్జాస్టర్లు ఎందుకు పనిచేయలేదు? రెస్క్యూ టీమ్ కు లేట్ గా సమాచారమివ్వడమేంది? 30 రోజుల నుంచి సేఫ్టీ మాక్ టెస్టు ఎందుకు చేపట్ట లేదు? పవర్ జనరేషన్ టైంలో బ్యాటరీలు మార్చడమేంది? ఫెయిల్యూర్స్ పై నోరు మెదపని రాష్ట్ర సర్కార్.
శ్రీశైలం ఎడమ గట్టు అండర్ గ్రౌండ్ పవర్‌ప్లాంట్లో అగ్ని ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ జెన్‌కో లైట్ తీసుకున్నాయి. ఈ ప్రమాదం తొమ్మిది మందిని బలితీసుకున్నా.. అదేదో చిన్న ఘటన అన్నట్టుగా జెన్‌కో, ట్రాన్స్కో సీఎండీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పవర్‌ప్లాంట్లో సేఫ్టీ నుంచి రెస్క్యూ ఆపరేషన్ వరకు అన్నింటా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. టెక్నికల్‌గా ఎన్నో చిక్కుముళ్లు ఉన్నా వాటిపై ప్రభుత్వం, జెన్కో నోరు విప్పడం లేదు.
ఇలాంటి ప్రమాదాలెన్నో జరిగాయని, ఉత్తరప్రదేశ్లోని ఎన్టీపీసీలో బాయిలర్ పేలి 30 మంది చనిపోయారని, తమిళనాడులో రెండుసార్లు బాలయిలర్లు పేలాయింటూ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ చెప్పుకొచ్చారు. ఇలావ్యాఖ్యానించడం శ్రీశైలం ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడమేనని ఎంప్లాయీస్ మండిపడుతున్నారు. ప్రమాదాన్ని స్టడీ చేయడానికి ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీలోనూ సీఎండీకి అనుకూలమైన వ్యక్తులనే నియమించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు విశ్వసనీయంగా ఉంటుందా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఘటన బయటకు రాకుండా ఆపాలని ప్రయత్నిం చింది. ప్లాంట్ లోపల 9 మంది చిక్కుకుపోవడం, వారిని బయటికి తెచ్చే మార్గం కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే విషయాన్ని బయట పెట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం ఇస్తే కనీసం సగం మంది ప్రాణాలైనా దక్కేవి. రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగితే మరుసటి రోజు పొద్దున 8.15 గంటలకు రెస్క్యూ టీంకు
సమాచారం ఇవ్వడంతో.. రెస్క్యూ ఆపరేషన్ లో ఆలస్యమైంది.
రాత్రే మంత్రి, సీఎండీ పవర్ ప్లాంట్ కు చేరుకున్నా ఘటనను తక్కువ చేసి చూపడానికే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఫలితంగా పవర్ ప్లాంట్ దెబ్బతినడంతో పాటు ఇంజనీర్లను, సిబ్బంది ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్లాంట్లో ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్ ఆటో ట్రిప్ కావాల్సి ఉంది. అయితే.. ప్రమాద సమయంలో లోపల సప్లయ్ కంటిన్యూ అయింది. ఇంజనీర్లు కంట్రోల్ ప్యానల్ నుంచి వస్తున్న మంటలను ఆర్పి మొత్తం పవర్‌ప్లాంట్ ను కాపాడే ప్రయత్నంలో అక్కడే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ..ఇంత ఘోరం జరిగితే జెన్ కో చాలా లైట్ తీసుకుంది. దీనిపై విచారం వ్యక్తం చేయాల్సింది పోగా ఇలాంటివి గతంలోనూ చాలా జరిగాయని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారు.
కమిటీలో ఉన్నోళ్లంతా సీఎండీ సన్నిహితులే
ప్రమాదంపై జెన్‌కో వేసిన కమిటీలో ఉన్నవాళ్లందరూ సీఎండీ ప్రభాకర్‌రావుకు సన్నిహితులే. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ట్రాన్స్ పరెంట్ గా రిపోర్టు ఇస్తుందా అనే అనుమానం ఇంజనీరింగ్ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ప్రమాదానికి భద్రతా లోపాలే అడుగడుగునా కనిపిస్తున్నాయి . అవి బయటికి వస్తే ప్రభుత్వం పరువు పోతుంది. రాజకీయంగానూ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితిని ముందే ఊహించి సీఎండీకి సన్నిహితంగా ఉండేవాళ్లతోనే కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి .