తెలంగాణ రాష్ట్రానికి ఫారిన్​ వర్సిటీలు!

తెలంగాణ రాష్ట్రానికి  ఫారిన్​ వర్సిటీలు!
  • టాప్​ వర్సిటీలొస్తే ఫ్రీగా భూమి?
  • అవసరమైన సదుపాయాలు కూడా
  • ఇప్పటికే ప్రైవేటు వర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • స్టేట్​ వర్సిటీల మాటేమిటంటున్న విద్యావేత్తలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోకి ఫారిన్​ యూనివర్సిటీలను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారులతో మంతనాలు జరుపుతున్నది. అమెరికాలోని టాప్​ వర్సిటీలు ఇక్కడ బ్రాంచ్​లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే వాటికి ఉచితంగా స్థలం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్టేట్​ యూనివర్సిటీలను గాలికి వదిలి.. విదేశీ, ప్రైవేటు యూనివర్సిటీల వైపు ప్రభుత్వం మొగ్గుచూపడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు.

అమెరికా వర్సిటీలపై వినోద్​ ఆరా

దేశంలో కొత్త విద్యావిధానం రూపకల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్‌‌ పాలసీ––2019 డ్రాఫ్ట్‌‌ను సిద్ధం చేసింది. త్వరలో జరిగే పార్లమెంట్‌‌ సమావేశాల్లో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే దేశంలో విదేశీ యూనివర్సిటీలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అయితే ఎలాగూ ఆ పాలసీకి ఆమోదం లభిస్తుందన్న గట్టినమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. దీంతో విదేశీ  వర్సిటీల రాకకు దాదాపు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చినట్టయింది. ఇటీవల రాష్ట్ర ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ వినోద్‌‌ కుమార్‌‌ అమెరికా పర్యటనలో ఇండియా రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో కలిశారు. కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్‌‌ యూనివర్సిటీ పెట్టే ఆలోచన చేస్తున్నదనే విషయాన్ని అమిత్​కుమార్​ దృష్టికి వినోద్​ తీసుకెళ్లారు. అమెరికాలోని టాప్‌‌  వర్సిటీల గురించి ఆరా తీసి, వాటి ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రదేశమని చెప్పారు. ఈ ప్రయత్నాలన్నీ ముందస్తు వ్యూహంలో భాగమేనని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

వాటికి అన్నిరకాల సదుపాయాలు!

విదేశీ యూనివర్సిటీలు తమ శాఖలను తెలంగాణలో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తే, అవసరమైన అన్నిరకాల సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశముంది. అమెరికాలోని టాప్​ యూనివర్సిటీలు తెలంగాణలో బ్రాంచ్​లు పెట్టేందుకు వస్తే ల్యాండ్‌‌ కూడా ఉచితంగా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అమెరికాలోని వివిధ వర్సిటీలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు అంశాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో వేల సంఖ్యలో తెలుగు స్టూడెంట్స్  చదువుతున్నారు. రాష్ట్రంలోనే ఆయా యూనివర్సిటీల బ్రాంచ్‌‌లుంటే, వారందర్ని అంతదూరం వెళ్లకుండా ఆపే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రైవేటు వర్సిటీలకు నాలుగు దరఖాస్తులు

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీ చట్టం జులై నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. టెక్ మహీంద్ర, పినాకిని(వాక్సన్‌‌), శ్రీనిధి, రాడ్‌‌క్లిఫ్ (అమిటీ) వంటి నాలుగు సంస్థలు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాయి. మొత్తం 8 సంస్థలు దరఖాస్తు చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. వీటన్నింటినీ పరిశీలించి, ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది. చాలా ప్రైవేటు యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకుంటాయని ప్రభుత్వం భావించినా.. పెద్దగా స్పందన కనిపించడం లేదు.

ఇక్కడి వర్సిటీల మాటేంది?

ఫారిన్, ప్రైవేటు వర్సిటీల కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వర్సిటీలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని విద్యావేత్తలు, స్టూడెంట్​ యూనియన్​ నేతలు ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్‌‌ వీసీలు లేక, ఈసీలు లేకుండానే అవి కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఏండ్ల తరబడి ప్రొఫెసర్‌‌ పోస్టులను భర్తీ చేయకుండా  నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. నిధుల కేటాయింపుల్లోనూ ఇదే ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని అంటున్నారు.

స్టేట్‌‌ వర్సిటీలను పట్టించుకోవాలి

విదేశీ, ప్రైవేటు వర్సిటీల వల్ల రాష్ట్ర స్టూడెంట్స్​కు ఎలాంటి ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌‌ వర్సిటీలకు నిధులివ్వకుండా, నియామకాలు చేపట్టకుండా బలహీనపరుస్తోంది. మూసేసేందుకు కుట్ర చేస్తోంది. ఫారిన్‌‌, ప్రైవేటు వర్సిటీల్లో డబ్బున్న వాళ్లే చదువుతారు. సర్కారీ వర్సిటీల్లో పేద, మధ్య తరగతి వాళ్లు​ చదువుతారు. ఇప్పటికైనా సర్కారు ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయాలి. – మనోహర్‌‌, ఔటా ప్రెసిడెంట్‌‌

TS government has embarked on efforts to bring foreign universities to the state