రెండు విడతల్లో మున్సి‘పోల్స్‌’?

రెండు విడతల్లో  మున్సి‘పోల్స్‌’?
  • స్టే లేని మున్సిపాల్టీలకు 4న నోటిఫికేషన్‌!
  • ఈ నెల 19 లేదా 21 తేదీల్లో పోలింగ్‌?
  • రిజర్వేషన్లు సిద్ధం చేసిన అధికారులు
  • మిగతా మున్సిపాల్టీలకు డిసెంబర్‌లోనే ఎన్నికలు!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మున్సిపల్‌‌‌‌ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. న్యాయపరమైన చిక్కులు లేని 53 మున్సిపాల్టీలు/ కార్పొరేషన్లకు ఈ నెల 4న నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మున్సిపాల్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్, అర్బన్​ డెవలప్​మెంట్​ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. శనివారం ఈసీకి రిజర్వేషన్ల వివరాలు అందజేస్తారని, సోమవారం నోటిఫికేషన్‌‌‌‌ వస్తుందని సమాచారం. జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, బడంగ్‌‌‌‌పేట, నిజాంపేట కార్పొరేషన్లతోపాటు 50 మున్సిపాల్టీల్లో ఈ నెల 19న పోలింగ్‌‌‌‌ నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్‌‌‌‌ ఒకట్రెండు రోజులు ఆలస్యమైతే 21లోగా పోలింగ్‌‌‌‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

వార్డుల విభజన సరిగా లేదని పిటిషన్లు

కరీంనగర్‌‌‌‌, రామగుండం, నిజామాబాద్‌‌‌‌, బోడుప్పల్‌‌‌‌, ఫీర్జాదిగూడ, బండ్లగూడ జాగీర్‌‌‌‌ కార్పొరేషన్లతోపాటు 77 మున్సిపాల్టీల్లో వార్డుల విభజన శాస్త్రీయంగా చేయలేదని హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. దీంతో ఆయా మున్సిపాల్టీల్లో ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌‌‌‌ జడ్జి స్టే విధించారు. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ కొనసాగగా, పిటిషన్లన్నింటినీ డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌కు బదలాయిస్తానని సింగిల్‌‌‌‌ జడ్జి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సింగిల్‌‌‌‌ జడ్జి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇస్తారనే నమ్మకంతో మున్సిపల్‌‌‌‌ శాఖ 121 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ముందుగా ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్‌‌‌‌ శాఖను ఆదేశించినట్టుగా తెలిసింది. కోర్టు చిక్కుల్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు డిసెంబర్‌‌‌‌ మూడో వారంలో పోలింగ్‌‌‌‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం.

పబ్లిక్‌‌‌‌ పల్స్‌‌‌‌ తెలుసుకునేందుకేనా?

హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉపఎన్నికలో సాధించిన ఘన విజయంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జోష్‌‌‌‌ మీద ఉంది. అదే ఫలితం మున్సిపల్​ ఎన్నికల్లోనూ రిఫ్లెక్ట్‌‌‌‌ అవుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అన్ని మున్సిపాల్టీలకు ఒకేసారి కాకుండా వివాదాల్లేని మున్సిపాల్టీల్లో మొదట ఎన్నికలు పెడితే అర్బన్‌‌‌‌ ఓటర్ల మూడ్‌‌‌‌ తెలుస్తుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలిసింది. మొదటి దశ ఫలితాలను బట్టి మిగతా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చనేది ప్రభుత్వ ఎత్తగడగా తెలుస్తోంది.