రూ.3 కోట్లతో ట్యాంక్​ బండ్​ కట్టి మురుగు నీరు నింపుతున్నరు

రూ.3 కోట్లతో ట్యాంక్​ బండ్​ కట్టి మురుగు నీరు నింపుతున్నరు

చెన్నూర్, వెలుగు: చెన్నూర్​లోని కుమ్మరికుంట మినీ ట్యాంక్​ బండ్​ లో మురికి నీరు నిండుతోంది. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం రూ.3 కోట్లతో దీన్ని నిర్మించగా.. ఇటీవలే మంత్రి హరీశ్​రావు  ప్రారంభించారు. రాత్రి పూట జిగేల్​మనే లైట్లు ఏర్పాటు చేశారు. డ్రైనేజీ మళ్లింపులపై దృష్టి పెట్టకపోవడంతో మురికినీటి మయం అవుతోంది. పట్టణంలోని మురుగునీరంతా కుంటలోకి చేరి, చుట్టుపక్క మొత్తం కంపు వాసన వస్తోంది.

కంపుతో ఇబ్బందులు..

ఈ చెరువు బస్టాండ్​కు దగ్గరగా, వ్యాపార సముదాయాల నడుమ ఉంది. అటువైపు వెళ్లే వారికి మురికి నీటి కంపుతో ముక్కు అదురుతోంది. కుంట దగ్గర ఉన్న పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంది. ప్రతిరోజు వచ్చే భక్తులు కూడా దుర్వాసన తట్టుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 డ్రైనేజీ మళ్లింపునకు చర్యలేవి...? 

కుమ్మరికుంట చెరువును కోట్ల ఖర్చుతో మినీ ట్యాంక్​బండ్​గా అభివృద్ధి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంట్లో మురుగునీరు కలవకుండా డ్రైనేజీలను మళ్లించడం పై దృష్టి పెట్టలేదు. మెయిన్ రోడ్డుకు ఒకవైపు నుంచి డ్రైనేజీ నీరు చెరువులోకి వెళ్లకుండా మత్తడి వైపు మళ్లించారు. కానీ, మెయిన్ రోడ్డుకు ఇవతలి వైపు ఉన్న 6, 14వ వార్డుల్లోని మురుగునీరు నేరుగా మినీ ట్యాంక్​బండ్​లోకి చేరుతోంది. దీంతో దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. మురుగునీరు చెరువులోకి వెళ్లకుండా ఆస్నాద్​ ఎక్స్ రోడ్డు నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు మరొక డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.  ఇప్పుడు కడుతున్న డ్రైనేజీకి లింక్ కలిపితే మినీ ట్యాంక్​బండ్​లోకి మురికి నీరు రాకుండా అరికట్టవచ్చు.  

దుర్వాసన, దోమల బెడద 

చెరువులో మురుగునీళ్లు నిండడం వల్ల దుర్వాసనతో పాటు దోమల బెదడ ఎక్కువైంది. రాత్రయితే చాలు చుట్టుపక్కల ఇండ్లలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ చెరువులోకి ముఖ్యంగా ఆదర్శనగర్, గెర్రె కాలనీ, కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్ నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ కలుస్తోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. తద్వారా దుర్వాసన, దోమల బెడద నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. 

 డ్రైనేజీ డైవర్షన్​ నిర్మిస్తాం...  

కుమ్మరికుంట మినీ ట్యాంక్​బండ్​లోకి వచ్చే డ్రైనేజీల డైవర్షన్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు. కానీ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈసారి వార్షిక బడ్జెట్​లో డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తాం. పట్టణంలోని 6,14,వార్డుల నుంచి వచ్చే మురికినీరు  కుంటలో కలవకుండా చర్యలు తీసుకుంటాం.

–గంగాధర్​, మున్సిపల్​ కమిషనర్​