- పట్టించుకోని రాష్ట్ర సర్కారు
- నష్టపోతున్న లక్షల మంది గిరిజనులు
- అటవీ ఉత్పత్తులకు దక్కని ‘మద్దతు’
ఆదిలాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం వన్‍ధన్ వికాస్ యోజన తీసుకొచ్చింది. ఈ స్కీంను రాష్ట్ర సర్కారు అమలు చేయకపోవడంతో లక్షల మంది గిరిజనులు నష్టపోతున్నారు. గిరిజనులు సేకరిస్తున్న మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్(ఎంఎఫ్‌పీ)లకు మినిమమ్ సపోర్ట్ ప్రైజ్(ఎంఎస్పీ) లభించేలా మార్కెటింగ్ చేసేందుకు కేంద్రం ఈ స్కీం తెచ్చింది. రెండేండ్ల నుంచి దేశంలో తెలంగాణ, పశ్చిమబెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ స్కీం అమలు చేసి గిరిజనులకు ఉపాధి కల్పించాలని సీఎంతో పాటు సీఎస్ కు ఇప్పటికే కేంద్రం లెటర్లు రాసింది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అడవులలో వివిధ ఉత్పత్తులు సేకరించేవారు, సంచార జాతులు, కొవిడ్‌కారణంగా స్వగ్రామాలకు తిరిగి చేరుకున్న కార్మికులు, హస్త కళాకారులకు ఈ స్కీంతో ఉపాధి లభిస్తుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య(ట్రైఫెడ్) వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
బ్రాండ్ పేరుతో అమ్మకాలు
వన్ ధన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వీటి ద్వారా గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులను విలువ ఆధారిత వస్తువులుగా మార్చి ఒక బ్రాండ్ పేరుతో విక్రయించడం ఈ పథకం లక్ష్యం. గిరిజనులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడం, శిక్షణ ఇచ్చి వస్తువుల విక్రయానికి సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి వ్యాపారం వృద్ధి సాధించడానికి ఈ స్కీం అవకాశం కల్పిస్తోంది. దేశంలో 27 రాష్ట్రాలు 307 జిల్లాల్లో ఈ పథకం కొనసాగుతోంది. 52 వన్ ధన్ స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో 3,110 వన్ ధన్ వికాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. 300 సభ్యులున్న ప్రతి వన్ ధన్ కేంద్ర క్లస్టర్లలో ఒక్కో దానికి కేంద్రం రూ. 15 లక్షలు అందజేస్తుంది.
అమలైతే రాష్ట్రంలో 10 లక్షల మందికి లబ్ధి
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గిరిజనులు ఇప్పటికీ అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. వారికి సరైన ఉపాధి, మార్కెటింగ్ సౌకర్యం లేక ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన వన్ ధన్ వికాస్ యోజన కింద ఆయా జిల్లాల్లో గిరిజనులు అటవీ ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్ చేసుకునేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అందజేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తేనే, ఇప్పపువ్వు, తునికాకు, వెదురు, ఆహార ఉత్పత్తులు, ఇలా ఎన్నో రకాలు గిరిజనులు సేకరిస్తున్నారు. ఇలా సేకరించే గిరిజనులకు ఈ స్కీం కింద పెట్టుబడి నిధులు ఇవ్వడం ద్వారా దాదాపు 10 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది. పక్క రాష్ట్రం ఏపీలో లో ఇప్పటికే వన్ ధన్ వికాస్ యోజన కింద 263 వన్ ధన్ వికాస్ క్లస్టర్లు మంజూరయ్యాయి. స్కీం కింద రూ. 55 కోట్ల వరకు ఖర్చు చేశారు. మన రాష్ట్రంలో సైతం ఈ పథకం అమలు చేసి ఉంటే ఇప్పటికే లక్షల మంది బెనిఫిట్ పొందేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి గతేడాది సీఎం కేసీఆర్, సీఎస్‌కు సైతం పథకం అమలు చేయాలని లెటర్లు రాశారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టలేదు.
రాష్ట్రం నిర్లక్ష్యంతో గిరిజనులకు నష్టం
వన్ ధన్ యోజన కింద కేంద్రం గిరిజనుల కోసం ఫండ్స్విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేయకపోవడంతో లక్షల మంది గిరిజనులు నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ఉత్పత్తులు సేకరించి వాటితో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వన్ ధన్ యోజన ఎంతో ఉపయోగపడుతుంది. నేరుగా కేంద్రమే నిధులను గిరిజనుల ద్వారా ఏర్పాటైన వన్‍ధన్ క్లస్టర్ లలో జమ చేస్తుంది. ఇటు మార్కెంటింగ్తో పాటు వ్యక్తిగత రుణాలు సైతం ఈ స్కీం కింద అందిస్తారు.
– సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ
