కరీంనగర్ ​మెడికల్ కాలేజీకి.. పర్మినెంట్ బిల్డింగ్‌ 

కరీంనగర్ ​మెడికల్ కాలేజీకి.. పర్మినెంట్ బిల్డింగ్‌ 
  • రూ.104.59కోట్లు మంజూరు చేసిన సర్కార్​
  • ఇప్పటికే కొత్తపల్లి సమీపంలో 25 ఎకరాలు కేటాయింపు 
  • 16న టెండర్లు ఖరారు. ఈ నెలాఖరులో పనులు ప్రారంభం
  • ఈ ఏడాది సీడ్ గోడౌన్‌లోనే క్లాసులు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పర్మినెంట్ బిల్డింగ్ కోసం ప్రభుత్వం ఫండ్స్​మంజూరు చేసింది. బిల్డింగ్​నిర్మాణానికి రూ.104.59కోట్లు విడుదల చేసింది. కాలేజీలో విశాలమైన క్లాస్ రూమ్స్​, లైబ్రరీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్‌లు, అడ్మిషన్‌ బ్లాక్స్​, హాస్టళ్లను నిర్మించనున్నారు. కొత్తపల్లి సమీపంలోని సీడ్ గోడౌన్స్ పక్కనే ఉన్న 25 ఎకరాల్లో పర్మినెంట్​ బిల్డింగ్​లు నిర్మించనున్నారు. వీటికి ఆగస్టు 16న టెండర్లు ఖరారుచేసి, నెలాఖరులోగా హెల్త్​మినిస్టర్​ హరీశ్ రావు చేత పనులు ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ భావిస్తున్నారు. 

100 సీట్లతో కాలేజీ..

కరీంనగర్ మెడికల్ కాలేజీ కోసం కరీంనగర్ జనరల్ హాస్పిటల్‌ను టీచింగ్​ హాస్పిటల్‌గా అప్ గ్రేడ్ చేస్తూ నిరుడు ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటినుంచి కొత్తపల్లి సమీపంలోని సీడ్ గోడౌన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నారు. అక్కడే ఈ ఏడాది జనవరిలో రూ.7 కోట్లతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఈ క్రమంలో కాలేజీని సందర్శించిన నేషనల్ మెడికల్ కమిషన్​ జూన్​6న 100 సీట్లతో కాలేజీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ నెలలో అడ్మిషన్లు పూర్తయ్యాక వచ్చే నెలలో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ మెడికల్ కాలేజీలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. జనరల్ సర్జరీ 4, జనరల్ మెడిసిన్‌, ఓబీజీ, అనస్తిషియాలో మూడు చొప్పున, పీడియాట్రిక్ లో రెండు, అనాటమీ, ఫిజియాలజీ, బయో-కెమిస్ట్రీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డీవీఎల్, సైకియాట్రీ, రేడియో డయాగ్నసిస్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ విభాగాల్లో ఒక్కో అసిస్టెంట్ ప్రొఫెసర్ చొప్పున పోస్టులు భర్తీ చేశారు.

మెరుగుపడనున్న సేవలు.. 

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాలతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజల హాస్పిటల్ అవసరాలను కరీంనగర్ తీరుస్తోంది. ఈ జిల్లాల నుంచి రోజూ వేలాది మంది పేషెంట్లు ఇక్కడికి వస్తుంటారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్ వచ్చాక క్లాసులు ప్రారంభమైతే జిల్లా హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. టీచింగ్ హాస్పిటల్‌గా అప్ గ్రేడ్ అయినందువల్ల వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి రానున్నారు.

ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తాం.. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కరీంనగర్‌ ప్రజల చిరకాల కోరిక. రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నచోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావడం కష్టమైనప్పటికీ.. సీఎం కరీంనగర్‌‌కు కాలేజీ మంజూరు చేశారు. పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.104 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేయిస్తాం. 

 - గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి