ప్రణీత్‌‌‌‌ రావు మెడకుఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

ప్రణీత్‌‌‌‌ రావు మెడకుఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్వినియోగం గుట్టురట్టైంది. ప్రతిపక్ష నేతలు, కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అనుమానం ఉన్న అధికారుల ఫోన్ల ట్యాపింగ్‌‌‌‌ రహస్యం బయటపడింది. స్పెషల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఐబీ) కేంద్రంగా నడిచిన సీక్రెట్‌‌‌‌ ఇల్లీగల్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ను కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నది. ఈ అక్రమ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌‌‌‌ రావును డీజీపీ రవిగుప్తా సోమవారం సస్పెండ్ ​చేశారు. ప్రణీత్‌‌‌‌రావు సస్పెషన్ ఆర్డర్​లో వెల్లడించిన కారణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఎస్‌‌‌‌ఐబీ ఆఫీస్‌‌‌‌లో సీసీ కెమెరాలను ఆపేసి 42 హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్స్‌‌‌‌, కంప్యూటర్స్‌‌‌‌, కాల్‌‌‌‌ డేటా రికార్డర్‌‌‌‌‌‌‌‌, ఐఎమ్‌‌‌‌ఈఐ, ఐపీడీఆర్‌‌‌‌‌‌‌‌ డేటాబేస్‌‌‌‌ను కుట్రపూరితంగా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రణీత్‌‌‌‌ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేసేందుకు చర్యలు చేపట్టారు.

రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్‌‌‌‌గా ఆపరేషన్స్

2007 బ్యాచ్‌‌‌‌కు చెందిన ప్రణీత్‌‌‌‌ రావు ఎస్‌‌‌‌ఐబీలో కీలక విభాగంలో పనిచేశాడు. ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌, ఓఎస్‌‌‌‌డీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావుకు ప్రణీత్‌‌‌‌ రావు దగ్గరి బంధువు. కీలకమైన ‘‘స్పెషల్ ఆపరేషన్స్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌’’(ఎస్‌‌‌‌ఓటీ) టీమ్‌‌‌‌కు ప్రణీత్‌‌‌‌రావు హెడ్‌‌‌‌గా వ్యవహరించాడు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో స్పెషల్‌‌‌‌ ఆపరేషన్స్ చేసేవాడు. దాదాపు 30 మందికి పైగా సిబ్బందితో టార్గెట్స్‌‌‌‌ వ్యక్తిగత వివరాలను సేకరించేవాడు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అనుమానిత అధికారులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతల డేటాను రికార్డ్ చేసేవారు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులను టార్గెట్‌‌‌‌ చేసేవారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ చేసి రహస్యాలను గుర్తించేవారు. ఆ సమాచారాన్ని అప్పటి సీఎం కేసీఆర్​కు చేరవేసేవారు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే యాగ్జిలరీ ప్రమోషన్‌‌‌‌ పొందాడు.

కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్‌‌‌‌

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారి ఫోన్‌‌‌‌కాల్స్‌‌‌‌ను ట్యాపింగ్‌‌‌‌ చేస్తునట్టు 2022లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్స్‌‌‌‌ ట్యాప్‌‌‌‌ చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై, అప్పటి పీసీసీ చీఫ్ ​హోదాలో ఉన్న సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌‌‌ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌‌‌‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్‌‌‌‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను సేకరించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్‌‌‌‌కాల్స్‌‌‌‌పై కూడా ఎస్‌‌‌‌ఐబీతో నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

డిసెంబర్ 9న ఎస్‌‌‌‌ఐబీలో ఫైళ్లు మాయం

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌కు అనుకూలమైన ఫలితాలు రావడంతో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్ అప్రమత్తమయ్యింది. వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లోని ఫైల్స్ మాయం అయ్యాయి. దీంతో పాటు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్‌‌‌‌ డేటాను ధ్వంసం చేసేందుకు ప్రణీత్‌‌‌‌రావు ప్లాన్ చేశాడు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌పై ఆధారాలను మాయం చేసేందుకు యత్నించాడు. గత ప్రభుత్వంలో జరిగిన సీక్రెట్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌, ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ వివరాలు బయటకు పొక్కకుండా ఎస్‌‌‌‌ఐబీ రూమ్‌‌‌‌లో ఆధారాలను ధ్వంసం చేశాడు. డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత ఎలక్ట్రీషియన్‌‌‌‌ సాయంతో బిల్డింగ్‌‌‌‌లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయించి స్పెషల్ ఆపరేషన్స్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌ లాగర్‌‌‌‌లోకి ప్రవేశించారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌కు సంబంధించిన ఆధారాలు లభించకుండా ఫైల్స్‌‌‌‌ను సెల్లార్‌‌‌‌లోకి తెచ్చి కాల్చేశాడు. 

1,800 డాక్యుమెంట్లు ధ్వంసం

సీడీఆర్‌‌‌‌(కాల్‌‌‌‌ డీటెయిల్‌‌‌‌ రికార్డు)లు, ఐఈఎంఐ, ఐపీడీఆర్‌‌‌‌ (ఇంటర్నెట్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ డీటెయిల్‌‌‌‌ రికార్డు) డేటా, డెస్క్‌‌‌‌టాప్‌‌‌‌ల హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లను ప్రణీత్ ​రావు మార్చేశాడు. మొత్తం42 హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌లలో డేటాను తొలగించడంతో పాటు కొత్త హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లను వాటి స్థానంలో ఫిక్స్‌‌‌‌ చేశాడు. పాత హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌లు, కొన్ని డివైజ్‌‌‌‌లను ధ్వంసం చేశారు. ఇంటెలిజెన్స్‌‌‌‌ సేకరించిన సిమ్‌‌‌‌ కార్డులకు చెందిన ఐఎమ్ఈఐ నంబర్స్‌‌‌‌ పూర్తిగా ఎరైజ్ చేశారు. వీటిలో ఉండే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డేటాను తొలగించారు. తాము రికార్డ్ చేసిన కాల్ రికార్డ్స్ లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా దాదాపు 1800 డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకే ఆధారాలను మాయం చేసినట్లు గుర్తించారు. ప్రణీత్‌‌‌‌రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొంత మంది ఇంటెలిజెన్స్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.