హైకోర్టుకు తప్పుడు సమాచారం.. నలుగురికి ఫైన్​

హైకోర్టుకు తప్పుడు సమాచారం.. నలుగురికి ఫైన్​

హైదరాబాద్, వెలుగు: తప్పుడు సమాచారం ఇచ్చిన నలుగురు వ్యక్తులకు హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంబర్‌‌‌‌పేటలో తమకు చెందిన సర్వే నంబర్‌‌‌‌ 57లో 2,432 చదరపు గజాల స్థలంలో టీఎస్​ ఎస్పీడీసీఎల్‌‌ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందంటూ ఆర్‌‌.మల్లేశ్‌‌ సహా మరో ముగ్గురు పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ నగేశ్‌‌ భీమపాక ఇటీవల విచారణ చేపట్టి, స్టేటస్‌‌కో ఆర్డర్‌‌ జారీ చేశారు. తాజాగా విచారణ సమయంలో పిటిషనర్‌‌ లాయర్‌‌ రాపోలు భాస్కర్‌‌ వాదిస్తూ.. ఆ జాగాలో శిథిలావస్థకు చేరుకున్న ఒక ఇల్లు ఉందని, దానికి పరిహారం చెల్లించి టీఎస్​ ఎస్పీడీసీఎల్‌‌ తీసుకునేందుకు చట్టాన్ని అమలు చేయాలన్నారు.

విద్యుత్తు సప్లయ్‌‌లో ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు 2013లో నాటి జిల్లా కలెక్టర్‌‌ 300 గజాల స్థలం కేటాయించారని కౌంటర్‌‌ పిటిషన్‌‌లో విద్యుత్​ సంస్థ పేర్కొంది. అక్కడేమీ ఇల్లు లేదని, పిటిషనర్ల ఆధీనంలోనే ఆ స్థలం ఉందని వివరించింది. గతంలో సివిల్‌‌ కోర్టులో వేసిన దావాను పిటిషనర్లు వాపస్‌‌ తీసుకున్నారని గుర్తుచేసింది. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. సివిల్‌‌ కోర్టులో దావా వేసిన విషయాన్ని హైకోర్టుకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే పిటిషన్‌‌ తప్పుగా వేసి యధాతథస్థితి ఉత్తర్వులు పొందారని మండిపడ్డారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ.. పిటిషినర్లకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.