చెరువులను రక్షించే తీరిక లేదా? ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

చెరువులను రక్షించే తీరిక లేదా? ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: నగరంలోని రామంతాపూర్‌‌ పెద్ద చెరువుతో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు చర్య లు తీసుకునే తీరిక లేదా? అని ప్రభుత్వ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. 2005 నాటి పిల్‌‌లో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటే కనీసం 2043 నాటికైనా చర్యలు తీసుకుంటారో లేదోనని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌‌ లో 532 చెరువులు, 200 తోటలు అంతరించిపోతున్నాయని.. 26 ఎకరాల్లోని రామంతాపూర్‌‌ పెద్ద చెరువును డంపింగ్‌‌ యార్డ్‌‌గా మార్చుతున్నారని, ఫలితంగా చెరువు నీరు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, దుర్వాసన వ్యాపిస్తోందంటూ ఓయూ  ప్రొఫెసర్‌‌ డాక్టర్‌‌ కేఎల్ వ్యాస్‌‌ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిల్ గా విచారణకు స్వీకరించింది. 

దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ లోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్‌‌.వి. శ్రవణ్‌‌ కుమార్​తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం మళ్లీ విచారించింది. గతవారం కోర్టు ఆదేశించిన మేరకు జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ రోనాల్డ్‌‌ రాస్, రెవెన్యూ, హెచ్‌‌ఎండీఏ ఆఫీసర్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. పెద్ద చెరువు రక్షణకు చట్టబద్ధమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రొనాల్డ్ రాస్ తెలిపారు. 

ఎఫ్‌‌టీఎల్‌‌ను తహసీల్దార్‌‌ గుర్తించి 2016లో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు రిపోర్టు పంపారని చెప్పారు. హెచ్‌‌ఎండీఏ నుంచి త్వరలో నోటిఫికేషన్‌‌ ఇస్తుందన్నారు. హైకోర్టు స్పందిస్తూ, 2005 నాటి పిటిషన్‌‌లో ఇంత తీరుబడిగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల12న జరిగే విచారణకు కూడా జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ హాజరు కావాలని, మున్సిపల్‌‌ శాఖ ఏం చర్యలు తీసుకుంటుందో వివరిస్తూ అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది.