వరదల కన్నా ముందే.. ప్లాన్ రెడీ చేసుకోవాలి:హైకోర్టు ఆదేశం

వరదల కన్నా ముందే..  ప్లాన్ రెడీ చేసుకోవాలి:హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వరదలు ముంచెత్తిన తర్వాత సహాయక చర్యలు తీసుకోవడం కంటే.. వరదలకు ముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పింది. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించడంతోపాటు సురక్షిత ప్రాంతాల్లో వరద బాధితులను ఉంచేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించింది. 

ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ డివిజన్‌ బెంచ్‌ సర్కార్​ను ఆదేశించింది. ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ వేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వరద నీటిలో గల్లంతైన మహాలక్ష్మి ఆచూకీ గుర్తించాల్సి ఉందని  ప్రభుత్వం చెప్పడంతో.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆమె చనిపోయినట్లు తేలితే.. కుటుంబానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. 

విపత్తుల నిర్వహణ చట్టంలోని 39వ సెక్షన్‌ ప్రకారం వరద నివారణకు దీర్ఘకాలిక చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కార్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. వరదల టైమ్​లో శాశ్వత పునరావాస కేంద్రాల ఏర్పాటు, తగిన నిధులు, వైద్య వసతులు, రక్షణ చర్యలు, పశుసంపద కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనలు చేసిన న్యాయవాదిని హైకోర్టు అభినందించింది. వరదల టైమ్​లో 192 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి 20,287 మందికి పునరావాసం కల్పించామని గవర్నమెంట్‌ స్పెషల్‌ ప్లీడర్‌ హరీందర్‌ పరిషద్‌ చెప్పారు. మహాలక్ష్మి ఆచూకీ తెలియలేదన్నారు. 49 మంది మరణించారని, ఆచూకీ తెలిసిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. సమగ్ర వివరాలు సబ్మిట్ చేసేందుకు గడువు కావాలని కోరారు. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్‌ 18కి వాయిదా వేసింది.