పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌‌లో నిమజ్జనం చేయొద్దు

పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌‌లో నిమజ్జనం చేయొద్దు

హైదరాబాద్, వెలుగు: ప్లాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పారిస్‌‌‌‌ (పీవోపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌, నీటి వనరులు, చెరువుల్లో నిమజ్జనం చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ నీటి వనరులలోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్‌‌‌‌‌‌‌‌ల బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహాల నిమజ్జనాలపై గతేడాది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే అమల్లో ఉంటాయని తేల్చిచెప్పింది. అలాగే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) తీసుకొచ్చిన నిబంధనల చట్టబద్ధతపై ఈ నెల 25న విచారణ చేపడతామని వెల్లడించింది. పీసీబీ రూపొందించిన సవరణ నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ హైదరాబాద్‌‌‌‌కు చెందిన తెలంగాణ గణేశ్‌‌‌‌ మూర్తి కళాకార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్, మరో 8 మంది గతేడాది దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది.

కాలుష్య నియంత్రణ సులభం అవుతుంది..

ప్రభుత్వ లాయర్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ, పీసీబీ నిబంధనల వల్ల కాలుష్య నియంత్రణ సులభం అవుతుందని చెప్పారు. ఆ నిబంధనలపై ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలను బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు సైతం ఆమోదించిందన్నారు. విగ్రహాలను నీటి వనరుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయడం లేదని వివరించారు. హుస్సేన్‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోటే విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని చెప్పారు. పిటిషనర్ల లాయర్ వాదిస్తూ, పీసీబీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు. పీసీబీ సవరించిన నిబంధనలపై ఎన్జీటీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. వివాదంలో ప్రతివాదిగా ఉన్న లాయర్‌‌‌‌‌‌‌‌ మామిడి మాధవ్ వాదిస్తూ, గతేడాది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు. నీటి వనరుల్లోనే విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు. విచారణ వాయిదా పడింది.