ఫార్మా సిటీ భూసేకరణ రద్దు.. తీర్పు వెల్లడించిన హైకోర్టు

ఫార్మా సిటీ భూసేకరణ రద్దు.. తీర్పు వెల్లడించిన హైకోర్టు
  • ప్రభుత్వ విధానాలను అధికారులే కాలరాస్తున్నారని ఆగ్రహం 
  • ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారమే పరిహారమివ్వాలి 
  • కొత్తగా భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశం  

హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను హైకోర్టు రద్దు చేసింది. భూసేకరణకు సంబంధించిన అవార్డు, పరిహార డిపాజిట్లు, డిక్లరేషన్‌‌ వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టింది. 2013 నాటి భూసేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడంతో తాము నష్టపోయామంటూ మేడిపల్లి, కుర్మిద గ్రామస్తులు వేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ ఎం. సుధీర్‌‌ కుమార్‌‌ ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు చెప్పింది. 

భూసేకరణ, పునరావాస చట్టం అమలు చేయలేదని తప్పుపట్టింది. అవార్డు, పరిహారం డిపాజిట్‌‌‌‌‌‌‌‌తో సహా తదుపరి అన్ని చర్యలను పక్కన పెట్టింది. ఏదైన భూసేకరణ చేయాలంటే 2017లో ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ ఇచ్చిన మెమో ప్రకారం వ్యవహరించాలని, కానీ దానిని అధికారులు ఉల్లంఘించారని బెంచ్ స్పష్టం చేసింది. ఆ మెమో ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని అభిప్రాయపడింది. అధికారులు తమ తప్పును గుర్తించకుండా పరిహార చెల్లింపుల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశారని పేర్కొంది. భూసేకరణ ప్రక్రియ చేపట్టి మూడేండ్లు గడిచినా ఫార్మా సిటీ నిర్మాణం ఆగిపోయిందని, తిరిగి భూసేకరణ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చునని తెలిపింది. భూసేకరణ చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలో పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు కూడా రెండు వారాల వ్యవధిలో తమ అభ్యంతరాలను తెలియజేయాలని, అధికారులకు సహకరించాలని చెప్పింది. ఈ తీర్పు ఇచ్చిన తేదీ నాటికి ఉన్న మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇరుపక్షాల ప్రయోజనాలను పరిరక్షించేలా చర్చలు జరపాలని తీర్పులో పేర్కొంది.