ఆ ఐఏఎస్, ఐపీఎస్​లను మళ్లీ కేటాయించండి..క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు

ఆ ఐఏఎస్, ఐపీఎస్​లను మళ్లీ కేటాయించండి..క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు
  • క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు 
  • ‘కేడర్’ వివాదం కేసులో కీలక తీర్పు  
  • ప్రత్యూష్ సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే 
  • కేటాయింపులు చేయండి 
  • ఆఫీసర్లందరి అభ్యంతరాలు తెలుసుకోవాలని కేంద్రానికి కోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ, ఏపీకి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ వివాదం కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అధికారుల కేటాయింపుపై మళ్లీ తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘ఆలిండియా సర్వీస్‌ ఆఫీసర్ల (ఐఏఎస్, ఐపీఎస్‌) కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలను సవాల్‌ చేసిన అధికారుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. వాటిని పరిశీలించి అధికారుల కేటాయింపుపై తగిన నిర్ణయం తీసుకోవాలి. గత పదేండ్ల సర్వీస్‌ను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అందరి నుంచి వేర్వేరుగా వినతిపత్రాలు తీసుకుని, వాళ్ల వాదనలు విన్నాకే గైడ్‌లైన్స్‌ ప్రకారం కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వాలి. ఇదంతా ప్రత్యూష్‌ సిన్హా కమిటీ గైడ్‌లైన్స్‌ మేరకే జరగాలి” అని కేంద్రానికి ఆదేశాలిచ్చింది. మాజీ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ ను ఏపీకి కేటాయించడం సబబేనని గత జనవరిలో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇతర అధికారులకు కూడా ఆ గైడ్‌లైన్స్‌ వర్తిస్తాయని చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్ బుధవారం తీర్పు ఇచ్చింది. 

ఇప్పుడు ఎక్కడున్నోళ్లు అక్కడ్నే.. 

అధికారులు ఎప్పటిలోగా వినతిపత్రాలు సమర్పించాలి? వాటిని కేంద్రం ఎప్పటిలోగా పరిష్కరించాలి? అనే దానికి హైకోర్టు నిర్దిష్టమైన గడువు పెట్టలేదు. అధికారుల కేటాయింపుపై మళ్లీ నిర్ణయం తీసుకునే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది. ఆఫీసర్ల అభ్యంతరాలను పరిశీలించాలని, స్థానికత, పదేండ్ల సర్వీస్, ఇంకా మిగిలి ఉన్న సర్వీస్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అప్పటి వరకు పిటిషనర్లను ఇప్పుడున్న చోటనే ఉంచాలని ఆదేశించింది. రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపులు చేసే పరిధి క్యాట్‌కు లేదని తేల్చిచెప్పింది. 

ఇదీ కేసు.. 

2014లో ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో ప్రత్యూష్‌ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల కేటాయింపు జరిగింది. కొందరిని ఏపీకి, మరికొందరిని తెలంగాణకు కేటాయించగా.. వాళ్లు కేంద్ర కేటాయింపులపై క్యాట్ ను ఆశ్రయించారు. కేటాయింపులకు విరుద్ధంగా తమకు నచ్చిన చోట విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. అయితే క్యాట్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేంద్రం అప్పీళ్లు దాఖలు చేసింది. మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ హైకోర్టు సీజే బెంచ్ గత జనవరిలో తీర్పు చెప్పింది. ఇదే తీర్పు మాజీ డీజీపీ అంజనీకుమార్‌, ఇతర అధికారులకు వర్తింపజేయాలని హైకోర్టును కేంద్రం కోరింది. అయితే కేడర్, సర్వీస్‌ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లపై విడిగా విచారణ జరపాలని అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను మరో బెంచ్‌కు హైకోర్టు బదిలీ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ ఆధ్వర్యంలోని బెంచ్‌ విచారించి తీర్పు వెలువరించింది.