హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పెట్టినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతిఓజా తెలిపారు. అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ నుంచి స్టూడెంట్లు తమ హాల్ టికెట్లు పొందవచ్చని వివరించారు. కాలేజీ ప్రిన్సిపాల్స్ కూడా సంబంధిత కాలేజీ లాగిన్స్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
హాల్ టికెట్ పై స్టూడెంట్ పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్ట్ తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని శృతిఓజా కోరారు. ఏమైనా తప్పులుంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపల్స్ లేదా డీఐఈవో దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కాగా, ప్రిన్సిపాల్స్ సంతకం లేకున్నా డౌన్ లోడ్ చేసిన హాల్ టికెట్లతో స్టూడెంట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు ఆమె ఆదేశాలు జారీచేశారు.
