పోటీకొస్తే అరెస్టే.!..సర్పంచులపై సర్కార్ ఉక్కుపాదం

పోటీకొస్తే అరెస్టే.!..సర్పంచులపై సర్కార్ ఉక్కుపాదం

హైదరాబాద్, వెలుగు:  హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో నామినేషన్లు వేసేందుకు బయలుదేరిన సర్పంచ్​లను అదుపులోకి తీసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. శుక్రవారం హుజూర్​నగర్​కు బయలుదేరిన సర్పంచ్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్​తోపాటు 30 మంది సర్పంచ్​లను నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్​గేట్​ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజంతా నిర్బంధంలో ఉంచి మిగతా సర్పంచ్​లను విడుదల చేసిన పోలీసులు.. భూమన్నను రహస్యంగా తరలించారు. ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారన్నది బయటపెట్టలేదు. అయితే.. భూమన్నను నిర్మల్​ సబ్​ జైల్లో పెట్టారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనపై ఓ పాత కేసును తిరగదోడి అదుపులోకి తీసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్​ వేసేందుకు బయలుదేరిన తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో పోలీసులు చెప్పలేదని, అరెస్టుకు సంబంధించి వారి వద్ద ఎటువంటి ఆర్డర్​ లేదని  నిర్బంధంలో నుంచి బయటకు వచ్చిన సర్పంచ్​లు అన్నారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు  సర్కార్​ ఇలా అణచివేస్తోందని వారు మండిపడ్డారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో పకడ్బందీగా ప్లాన్​ చేసి భూమన్న​ను అరెస్టు చేశారని మండిపడ్డారు. బెయిల్​కు అవకాశం
లేకుండా చేయడమే పోలీసుల ప్లాన్​గా కనిపిస్తోందని ఆరోపించారు.

గ్రామాలకు నిధులు, అధికారాల కోసం అడిగితే..

ప్రభుత్వం గ్రామాలకు నిధులు విడుదల చేయకుండా, అధికారాలు ఇవ్వకుండా పెత్తనం చేస్తోందని సర్పంచ్​లు కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్నారు. సర్పంచ్ , ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్  ఇచ్చి ఊళ్లలో కొత్త చిచ్చు పెట్టిందని తప్పుబడుతున్నారు. జాయింట్​ చెక్​ పవర్​ రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. అయితే.. రద్దు చేసేది లేదని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ స్పష్టం చేయడం సర్పంచ్​లను మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి తామంటే ఏందో ఎన్నికల ద్వారా చూపించాలని సర్పంచ్​లు నిర్ణయించుకున్నారు. హుజూర్​నగర్​ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న దృష్ట్యా అక్కడ మూకుమ్మడిగా పోటీ చేయాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇటీవల 251 మంది సర్పంచ్ లు ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సర్పంచ్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్​తో పాటు మరో 29 మంది సర్పంచ్​లు బయలుదేరారు. వారిని  టాస్క్ ఫోర్స్ పోలీసులు నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ దగ్గర మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకురాలు డి.కె.అరుణ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో అర్ధరాత్రి మిగతా సర్పంచులను విడుదల చేసిన పోలీసులు.. భూమన్న యాదవ్​ ఆచూకీ మాత్రం బయటపెట్టలేదు. ఆయనను నిర్మల్​ సబ్​ జైలులో ఉంచినట్లు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈసీకి సర్పంచ్​ల ఫిర్యాదు

నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకోవటంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు భగ్గుమన్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ లోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్​ ఎదుట కొందరు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సర్పంచ్ సంఘం నేతలు ఎన్నికల కమిషన్​ సీఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సెక్రటేరియట్ లో ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆఫీసులో ఫిర్యాదు కాపీని అందజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉందని, అయినా ప్రభుత్వం అరెస్టు చేస్తూ బెదిరిస్తోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌర, ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. వెంటనే భూమన్న యాదవ్ ను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సర్పంచ్ లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

నామినేషన్లు వేయాలని పిలుపు

తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపబోమని సర్పంచ్​లు అంటున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుతామని చెబుతున్నారు. కొందరిని అరెస్టు చేసినంత మాత్రానా ఉద్యమం ఆగదని అంటున్నారు. రాష్ట్రంలో 12,751 సర్పంచ్ లు ఉన్నారని, వీలైనంత మంది హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేయాలని సర్పంచుల సంఘం నాయకురాలు ధనలక్ష్మి పిలుపునిచ్చారు. వచ్చే నెల 4 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉన్నందున గతంలో అనుకున్న దానికన్నా ఎక్కువే నామినేషన్లు వేస్తామని ఆమె తెలిపారు.

నిజామాబాద్ ఫలితం  భయంతోనే..

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటుకు పెద్ద ఎత్తున పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అధికార టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా 251 మంది సర్పంచులు పోటీ చేస్తామని ప్రకటించడంతో టీఆర్​ఎస్​ సర్కార్​లో భయంపట్టుకుందని, అందుకే అణచివేస్తోందని సర్పంచ్​ సంఘాల నేతలు అంటున్నారు. ఏదైనా అసెంబ్లీ  సెగ్మెంట్​ ఎన్నికల్లో 200 మంది వరకు అభ్యర్థులు పోటీలో ఉంటే ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఆ సంఖ్య దాటితే ఎన్నికకు అనివార్యంగా బ్యాలెట్‌‌ పేపర్లు ఉపయోగించాల్సి వస్తుంది. లాయర్లు కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారు. దాంతో టీఆర్​ఎస్​ అభ్యర్థి ఓడిపోతాడన్న భయంతో రాష్ట్ర సర్కారు తమను నామినేషన్లు వేయకుండా పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని సర్పంచ్​లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్కు ఓటమి భయం

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సర్పంచ్ లను టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్బంధించడం ఏమిటి?  ఓటమి భయంతోనే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. నిర్బంధించిన వారినందరినీ విడుదల చేయాలి. నామినేషన్లు వేసేందుకు అనుమతించాలి. అక్రమ అరెస్టులపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.

– వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ నేత

టెర్రరిస్టులమా.. గజదొంగలమా?

నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడమేంది? మేమేమైనా ఐసిస్ టెర్రరిస్టులమా.. గజదొంగలమా?  మా ఫోన్లు తీసుకొని, కారణం చెప్పకుండా మఫ్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో  పోటీ చేస్తాం. మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నామినేషన్లను అడ్డుకుంటే ఉమ్మడిగానైనా అభ్యర్థిని నిలబెడుతాం. సర్పంచ్ ల ఉద్యమాన్ని ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోంది. బంతి గోడకు ఎంత వేగంగా కొడితే తిరిగి అంతే వేగంగా తిరిగి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

– మల్లేశ్, రాష్ట్ర సర్పంచ్​ల సంఘం వైస్​ ప్రెసిడెంట్​ (సర్పంచ్, కోల్లకల్ గ్రామం, మెదక్ జిల్లా)

 ఉధృతం చేస్తాం

మా ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. మా సమస్యల పరిష్కరించనందు వల్లే నామినేషన్లు వేస్తున్నాం. ఇందుకు హూజూర్ నగర్ వెళ్లే సమయంలో ప్రభుత్వం ఎన్నో అడ్డుంకులు సృష్టించింది. సర్పంచ్ లు అందరూ ప్రభుత్వ తీరును ఖండిస్తూ మద్దతు తెలుపుతున్నారు. అరెస్టు చేసిన భూమన్న యాదవ్ ను విడుదల చేయాలి. మా హక్కులు నెరవేరే వరకు పోరాటం చేస్తూనే  ఉంటాం.

– పాండు గౌడ్,  రాష్ట్ర సర్పంచ్​ల సంఘం అధికార ప్రతినిధి (సర్పంచ్, తర్నికల్ గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా)