కేసీఆర్ చెప్పింది అబద్ధం.. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లినప్పుడు కరెంట్ పోలేదు 

కేసీఆర్ చెప్పింది అబద్ధం.. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లినప్పుడు కరెంట్ పోలేదు 
  • టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్ పర్యటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రెండుసార్లు కరెంట్ పోయిందని మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా చేసిన ఆరోపణలను టీఎస్ ఎస్పీడీసీఎల్ ఖండించింది. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో గానీ, ఆ చుట్టుపక్కల గానీ కరెంట్ పోలేదని స్పష్టం చేసింది. ఆ టైమ్ లో ఎలాంటి పవర్ కట్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 

కేసీఆర్ చెప్పిన విషయాన్ని నమ్మి కొన్ని మీడియా సంస్థలు కరెంట్ పోయినట్టు రిపోర్ట్​ చేశాయని, కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఎస్పీడీసీఎల్ తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘సంబంధిత సబ్​ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్స్ డిజిటల్ మీటర్లలో ఎక్కడ కూడా కరెంట్​కట్​అయినట్టు రికార్డు కాలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ఇంటికి ఎలాంటి కోతలు లేకుండా కరెంట్​అందుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ కరెంట్​పోయిందని చేసిన ఆరోపణలు అవాస్తవం” అని టీఎస్​ఎస్పీడీసీఎల్ మహబూబ్​నగర్ ఆపరేషన్​ సూపరింటెండెంట్ ​పేర్కొన్నారు.