టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల అప్లికేషన్లకు 3రోజులే చాన్స్

టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల అప్లికేషన్లకు 3రోజులే చాన్స్
 • ఈ నెల 28 నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తులు
 • షెడ్యూల్ రిలీజ్.. 27న సీనియారిటీ లిస్టు!

హైదరాబాద్, వెలుగు: టీచర్లు, హెడ్మాస్టర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ఎట్టకేలకు రిలీజైంది. ఈ నెల 27 నుంచి మార్చి 4వ తేదీ దాకా 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా ప్రమోషన్ల ప్రాసెస్‌‌‌‌ను చేపట్టనున్నారు. అయితే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు కీలకమైన గైడ్​లైన్స్‌‌‌‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. దీన్ని సర్కారు గోప్యంగా పెట్టింది. మరోవైపు దరఖాస్తులకు కూడా మూడు రోజులే గడువు ఇచ్చింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ దాకా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లికేషన్లను స్వీకరించనుంది.

 

 • అన్ని కేటగిరీల ఖాళీలు, టీచర్ల ప్రమోషన్లకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్, సీనియారిటీ లిస్టులను ఈనెల 27న ప్రకటించనున్నారు.
 • 28 నుంచి 30వ తేదీ దాకా ఆన్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
 • దరఖాస్తుల హార్డ్​కాపీలను హైస్కూల్ టీచర్లు సంబంధిత హెడ్మాస్టర్లకు.. గవర్నమెంట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు సంబంధిత ఎంఈఓలకు.. మండల పరిషత్ ప్రైమరీ, యూపీఎస్ టీచర్లు సంబంధిత కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు.. హైస్కూల్ హెడ్మాస్టర్లు డీఈఓలకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 దాకా అందించాలి.
 • ఫిబ్రవరి 3 నుంచి 6 దాకా అప్లికేషన్ల హార్డ్ కాపీలను సంబంధిత హెడ్మాస్టర్లు, ఎంఈఓలు డీఈఓ ఆఫీసులో సమర్పిస్తారు. వాటి పరిశీలన, ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమోదం తదితర ప్రక్రియలు 
 • జరుగుతాయి.
 • 7న డీఈఓ/ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులు, ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులు ప్రకటిస్తారు.
 • 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన చేసి.. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు.
 • 11,12 తేదీల్లో ఫైనల్ సీనియారిటీ లిస్టు.. హెడ్మాస్టర్ల బదిలీలకు వెబ్ఆప్షన్ల నమోదు ఉంటుంది.
 • 13న మల్టీజోనల్ స్థాయిలో హెడ్మాస్టర్ల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునర్ పరిశీలన ఉంటుంది.
 • 14న హెడ్మాస్టర్ల బదిలీ ఉత్తర్వులను ఆర్జేడీలు ఇస్తారు.
 • 15న బదిలీల తర్వాత మిగిలిన ఖాళీల ప్రకటన.
 • 16, 17, 18వ తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ స్కూల్స్ హెడ్మాస్టర్ల ప్రమోషన్ల కౌన్సెలింగ్.
 • 19, 20వ తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీల ఆప్షన్స్ నమోదు.
 • 21న ఆప్షన్ల సవరణ, పునర్ పరిశీలనకు అవకాశం.
 • 22, 23వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ఉత్తర్వులివ్వనున్న డీఈఓలు.
 • 24న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల తర్వాత ఏర్పడిన ఖాళీల ప్రకటన.
 • 25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు.
 • 28, మార్చి1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్స్ నమోదు.
 • మార్చి3న ఆప్షన్ల సవరణ, పునర్ పరిశీలన.
 • 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు బదిలీ ఆర్డర్లు.
 • 5 నుంచి 19 వరకు డీఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​కు పంపాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.

9,706 మందికి ప్రమోషన్!

రాష్ట్రంలో 1.05 లక్షల మంది టీచర్లుండగా, వీరిలో సుమారు 9,706 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో హెడ్మాస్టర్ పోస్టులు 2,013, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,563, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు 2,130 ఉన్నాయి. మరోపక్క బదిలీల ప్రక్రియకు రెండేండ్ల స్టేషన్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే 75 వేల మంది అర్హులుగా ఉంటారు. జీవో 317తో ఇతర జిల్లాలకు మారిన సుమారు 25 వేల మందికి ట్రాన్స్‌‌‌‌ఫర్లలో పాల్గొనే అవకాశం ఉండట్లేదు.

గైడ్​లైన్స్‌‌‌‌పై నో క్లారిటీ

ఈ నెల 15న సంక్రాంతి రోజున టీచర్ల సంఘాలతో సమావేశం నిర్వహించిన మంత్రులు హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి.. రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్, గైడ్​లైన్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ వారం రోజులైనా గైడ్​లైన్స్ విషయంలో సర్కారు స్పష్టత ఇవ్వలేదు. బదిలీలకు రెండేండ్లు నిండితేనే అవకాశం ఇస్తామని చెప్పడం, హెడ్మాస్టర్ల బదిలీలకు అర్హతను 8 ఏండ్ల సర్వీస్‌‌‌‌కు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై టీచర్ల సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోపక్క జీవో 317 బాధితులు, స్పౌజ్ బాధితుల ఆందోళనల నేపథ్యంలో గైడ్​లైన్స్ ఇచ్చేందుకు సర్కారు భయపడుతున్నట్లుగా తెలుస్తున్నది. ఈ నెల 27న గైడ్​లైన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం బయటికి వచ్చిన బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ కూడా సర్కారు అధికారికంగా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. కానీ ఇదే సరైన షెడ్యూల్ అని ఆఫీసర్లు ధ్రువీకరించారు. 27న రిలీజ్ చేసే సీనియారిటీ లిస్టుల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే షెడ్యూల్‌‌‌‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.