- వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఐఎస్ క్యాంపులే టార్గెట్
- ‘ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్’ పేరుతో దాడులు
న్యూయార్క్: సిరియాలోని ఐఎస్ టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా అమెరికా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మొదలైన దాడులు.. శనివారం ఉదయం వరకు కొనసాగాయి. సిరియాపై బాంబుల వర్షంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దాడులకు సంబంధించిన వీడియోలను అమెరికన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
కాగా, ఈ నెల 13న పాల్మిరాలో అమెరికన్, సిరియా దళాల కాన్వాయ్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు అమెరికన్ సోల్జర్లు, ఒక సివిలియన్ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులోభాగంగా తాజాగా సిరియాలోని టెర్రర్ క్యాంపులపై అమెరికా మెరుపుదాడులకు దిగింది. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్’ అని పేరు పెట్టింది.
70కి పైగా ఐఎస్ స్థావరాలపై దాడులు
సిరియాలోని డీర్ ఎజ్-జోర్, రక్కా ప్రావిన్సులు, పాల్మిరా సమీపంలోని జబల్ అల్ అమూర్ ప్రాంతాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. సుమారు 70కి పైగా ఐఎస్ స్థావరాలను అమెరికా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్ -15 ఈగిల్ జెట్‌లు, ఏ-10 థండర్‌బోల్ట్ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు, హిమార్స్ రాకెట్లతో 100కు పైగా ఖచ్చితమైన క్షిపణులను దాడులకు ఉపయోగించారు. ఐదుగురు ఐఎస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తున్నది.
వీరిలో డ్రోన్ సెల్ లీడర్ కూడా ఉన్నట్లు సమాచారం. యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ మాత్రం చాలామంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని చెప్పారు. ఐఎస్‌కు చెందిన వెపన్స్ గోడౌన్లు, కమాండ్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
టెర్రరిస్టులకు ఇదే మా హెచ్చరిక: ట్రంప్
సిరియాపై దాడుల విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఘాటుగా స్పందించారు. ఇది యుద్ధం కాదని, అమెరికన్లను చంపినందుకు తీసుకున్న ప్రతీకార చర్య అని పేర్కొన్నారు. ‘‘అమెరికా సోల్జర్లపై దాడి చేయాలనుకునే టెర్రరిస్టులకు ఇదే మా హెచ్చరిక. మీరు ఊహించని రీతిలో బుద్ధి చెప్తాం.
ఈ దాడులకు సిరియా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చింది. 13వ తేదీన చనిపోయిన మా సోల్జర్లకు ఈ ప్రతీకార దాడులతో నివాళులర్పిస్తున్నాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఐఎస్ టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలు, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రకటించారు.
