- పంజాబ్, హర్యానా, బిహార్‌లోనూ ఇదే పరిస్థితి
- ఢిల్లీలో ఏక్యూఐ 'వెరీ పూర్'.. 100కి పైగా విమానాలు రద్దు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలపై పొగమంచు దుప్పటిలా అలుముకుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్‌మహల్ కూడా దట్టమైన పొగమంచులో పూర్తిగా కలిసిపోయింది. అసలు ఏ మాత్రం కనిపించకుండా పోవడంతో దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మధ్యాహ్నం 3 గంటల వరకే స్కూళ్లు
చలి, పొగమంచు నేపథ్యంలో ఆగ్రా జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 20 నుంచి అన్ని స్కూళ్ల(సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతో సహా)ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నడపాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలు 1 నుంచి 8వ తరగతులకు వర్తిస్తుందని చెప్పారు. అయోధ్యలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం.. ఢిల్లీ, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ఏరియాల్లో ఆదివారం వరకు అతి దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. 24 వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.
ఢిల్లీలో100 కి పైగా విమానాలు రద్దు
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యంతో కూడిన దట్టమైన పొగమంచు వల్ల విజిబిలిటీ జీరోకి తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 380 వద్ద 'వెరీపూర్' కేటగిరీలోకి వచ్చింది. ప్రగతి మైదాన్ లో ఉదయం 7 గంటలకు ఏక్యూఐ 433గా నమోదైంది. ఆనంద్ విహార్ లో 428 ఏక్యూఐ రిజిస్టర్ అవ్వగా.. ఇందులో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం2.5) ప్రధాన కాలుష్య కారకంగా ఉంది. పొగమంచుతో విజిబిలిటీ తగ్గడంతో ఢిల్లీలో 100 కి పైగా విమానాలు రద్దయ్యాయి. అనేక విమానాలతోపాటు 50 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.విమానాశ్రయానికి వెళ్లే ముందు అప్ డేట్స్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులను విమానయాన సంస్థలు కోరాయి.
