ప్రయాణికుడిపై పైలట్ దాడి..ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘటన

ప్రయాణికుడిపై పైలట్ దాడి..ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘటన

న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ కు చెందిన పైలట్‌‌ తనపై దాడి చేశాడని స్పైస్‌‌ జెట్‌‌ విమాన ప్రయాణికుడు అంకిత్‌‌ దివాన్‌‌ ఆరోపించారు. ఢిల్లీ విమానా శ్రయంలోని టెర్మినల్‌‌ 1లో ఈ ఘటన జరిగింది. ఆయన దీనిని ‘ఎక్స్’ లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 4 నెలల కుమార్తెతో సహా కుటుంబంతో కలిసి స్పైస్‌‌ జెట్‌‌విమానంలో ప్రయాణించేందుకు అంకిత్ దివాన్ ఢిల్లీ ఎయిర్‌‌పోర్టుకు వచ్చారు.

 అక్కడున్నవారు సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెక్‌‌ -ఇన్‌‌ లైన్‌‌ లో వెళ్లాలని ఆయనకు సూచించారు. ఈ క్రమంలో వారు ఉన్న క్యూలోకి కొందరు మధ్యలో దూరిపోవడంతో ఆయన ప్రశ్నించారు. ఎయిరిండియా ఎక్స్‌‌ ప్రెస్‌‌ పైలట్‌‌ వీరేందర్‌‌ కూడా అలాగే చేయడంతో.. అతడిని కూడా అడిగారు. ఈ క్రమంలో అంకిత్ దివాన్​ను వీరేందర్ దుర్భాషలాడాడు. అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సంయమనం కోల్పొయిన పైలట్ అంకిత్​పై దాడి చేశాడు. 

ఈ పోస్టుకు తన ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఫొటోను కూడా అంకిత్‌‌ పంచుకున్నారు. ఈ ఘటనను ఇక్కడితో వదిలేసేలా ఓ లేఖ రాయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. దీనిని ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌‌ చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌‌ ప్రెస్‌‌ స్పందించింది. పైలట్‌‌ అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్టు తెలిపింది. సంబంధిత ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్టు వెల్లడించింది.