- 12న ఎగ్జామ్.. జిల్లాల్లో సిబ్బందిని నియమించలె
- పరీక్షకు ఏర్పాట్లు చేయని అధికారులు
- పరీక్షకు ఏర్పాట్లు చేయని అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 7 రోజుల్లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) జరగనుంది. ఈ పరీక్షకు 3.80 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. జిల్లాల్లో సెంటర్లు గుర్తించినా సిబ్బందిని నియమించలేదు. కొన్నిచోట్ల నియమించినా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వలేదు. ఈ నెల12న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 ఉంటుంది. టెట్‌కు 6,29,352 దరఖాస్తులు అందగా.. వాటిలో పేపర్ 1కు 3,51,468, పేపర్ 2కు 2,77,884 ఉన్నాయి. ఏప్రిల్12న అప్లికేషన్ల గడువు ముగియగా, అప్పటి నుంచి ఏర్పాట్లపైనే అధికారులు దృష్టి పెట్టారు. అయితే కీలకమైన టైమ్ లో టెట్డిప్యూటీ డైరెక్టర్ ఫారిన్ టూర్‌కు వెళ్లొచ్చారు. దీంతో ఏర్పాట్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. కీలకమైన అధికారి లేకపోవడంతో ఏర్పాట్లలో ఆలస్యమైంది. కాగా, పేపర్ 1కు 1,480 సెంటర్లు, పేపర్2కు 1,203 సెంటర్లను అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 113 సెంటర్లు ఉన్నాయి. వీటిలో సౌలతులు కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టారు.
ఇతర పనుల్లో సిబ్బంది...
టెట్‌కు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు మాత్రమే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందిన వారుంటారు. మిగిలిన హాల్ సూపరింటెండెంట్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, మిగతా సిబ్బంది ఇతర డిపార్ట్మెంట్ల వారిని నియమించాల్సి ఉంది. కానీ కొన్ని జిల్లాల్లోనే డీఓలు, సీఎస్‌లను నియమించారు. ఇప్పటికీ ఏ జిల్లాలోనూ ఇన్విజిలేటర్లను నియమించలేదు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం సీఎస్, డీఓలకు ఫస్ట్ ఫేజ్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లో ట్రైనింగ్ ఇవ్వలేదని సమాచారం. సిబ్బందిని నియమించిన తర్వాత రెండుసార్లు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ నియామకాలే కాకపోవడం గమనార్హం. అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోందని అధికారులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, బడి బాట, కరోనా వాక్సినేషన్ డ్రైవ్ తదితర కార్యక్రమాలతో పాటు టెన్త్ స్పాట్, ఓపెన్ స్కూల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు, సిబ్బంది ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో టెట్‌పై పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్విజిలేటర్లంతా కూడా నాన్ టీచింగ్ సిబ్బందినే నియమించాల్సి ఉంది. అది కూడా జూనియర్ అసిస్టెంట్ కేడర్ వాళ్లనే. దీంతో వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఏర్పాట్లు జరుగుతున్నయ్..
సోమవారం నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 11 తర్వాత వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. టెట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాల్లో కలెక్టర్లు, డీఈఓలు ఆ పనుల్లో ఉన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నం.
- రాధారెడ్డి, టెట్ కన్వీనర్
