టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన గర్భిణి మృతి

 టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన గర్భిణి మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్  టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక అనే గర్భిణి మృతి చెందింది.  నిమిషం నిబంధన అమలులో ఉండటంతో పరీక్ష రాసేందుకు వచ్చిన ఎనిమిది నెలల గర్భిణి రాధిక.. ఎగ్జామ్ హాల్​కు వెళ్లే తొందరలో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఒక్కసారిగా టెన్షన్ కు గురైన రాధికకు..చెమటలు పట్టి బీపీ పెరిగి  పరీక్షా హాలులోనే కిందపడిపోయింది. వెంటనే స్పందించిన ఇన్విజిలేటర్.. ఇతర సిబ్బంది  భర్త అరుణ్ కు ఫోన్ చేయడంతో  ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాధిక మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు.  రాధిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా  విలపిస్తున్నారు. రాధిక, అరుణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 రాధిక 8 నెలల గర్భిణి అయినా కూడా..టెట్ పరీక్ష కోసం రాత్రింబవళ్లు  చాలా కష్టపడి చదివిందని భర్త అరుణ్ కన్నీరుమున్నీరుగా విలపిచారు. బీపీ ఎక్కువై  పడిపోయిందని... పాఠశాల సిబ్బంది ఫోన్ చేశారని..ఆ వెంటనే పటాన్​చెరు ఆస్పత్రికి తీసుకొచ్చామన్నాడు.  అయితే హాస్పిటల్​కు వస్తుంటే మధ్యలో తన ముక్కు నుంచి రక్తం కారిందని... చాలా సీరియస్​ అవుతుందని అనుకున్నా కానీ... ప్రాణాలే పోతాయని మాత్రం ఊహించలేదని బాధపడ్డాడు. గర్భవతి అయినా కూడా.. అటు తన ఆరోగ్యం చూసుకుంటూ.. ఇటు తన ఆశయం కోసం కష్టపడిందని చెప్పుకొచ్చాడు. ఎన్నో రోజుల నుంచి రాత్రింబవళ్లు కష్టపడుతూ పరీక్షకు ప్రిపేర్ అయిందని..  తీరా పరీక్ష రాయడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయాయంటూ బోరున ఏడ్చాడు.