
హైదరాబాద్ మణికొండకు చెందిన రాజ్యలక్ష్మి 5 నెలల గర్భిణిగా ఉన్నపుడు ఓ స్కానింగ్ సెంటర్‌లో పరీక్ష చేయించుకున్నారు. సెంటర్ వాళ్లు శిశువు ఆరోగ్యంగానే ఉందని రిపోర్టిచ్చారు. తర్వాత రాజ్యలక్ష్మి ఆడ శిశువుకు జన్మనివ్వగా వెన్నులో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రూ.2 లక్షలు కట్టి శిశువుకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. బిడ్డ వెన్నులో సమస్య ఉన్నా స్కానింగ్ సెంటర్ వాళ్లు గుర్తించలేదంటూ బాధితురాలు తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను సంప్రదించారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వాస్తవమేనని గుర్తించిన సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్.. రూ.2 లక్షలు చెల్లించాలని వాళ్లను ఆదేశించారు.
హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ ఇటీవల ఓ మాల్‌లో షాపింగ్ చేశాడు. కొన్న బట్టలు తీసుకెళ్లేందుకు క్యారీ బ్యాగ్ అడిగితే షాపు సిబ్బంది రూ.5 తీసుకొని కవర్ ఇచ్చారు. కవర్‌పై షాపు పేరు కనిపించేలా లోగో ఉండటంతో శ్రీకాంత్ టీఎస్‌సీఐసీని ఆశ్రయించాడు. షాపు పేరు ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఫ్రీగా ఇవ్వాలని, తన దగ్గర డబ్బులు తీసుకొని అమ్మిన కవర్‌తో ప్రచారం ఎలా చేసుకుంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్పందించిన టీఎస్‌సీఐసీ.. గతంలో చండీగఢ్ కన్జ్యూమర్ ఫోరం ఇచ్చిన తీర్పు ప్రకారం షాపు లోగో ఉన్న బ్యాగులను ఫ్రీగా ఇవ్వాలని మాల్ యాజమాన్యానికి నోటీసులిచ్చి రూ.7 వేల జరిమానా విధించింది.
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ మోసాలు, సేవల్లో లోపాలు, కొలతల్లో తేడాలు, నాణ్యత లేని వస్తువుల అమ్మకాలు.. ఇలా వినియోగదారుల సమస్యలేవైనా పరిష్కరిస్తామని తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (టీఎస్‌సీఐసీ) భరోసా ఇస్తోంది. సత్వర పరిష్కారం, పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని చెబుతోంది. జిల్లా కన్జ్యూమర్ ఫోరంలలో ఖాళీల వల్ల పెండింగ్ కేసులు పెరుగుతుండటం, పరిష్కారం లేటవుతుండటంతో కొన్ని రకాల కేసుల్లో బాధితులకు టీఎస్‌సీఐసీ ఊరటనిస్తోంది.
2014లో మొదలు
టీఎస్‌సీఐసీ 2014లో మొదలైంది. వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్ (1800-42500333)ను ఏర్పాటు చేసింది. సెంటర్ స్టార్టయినప్పటి నుంచి ఈ ఆగస్టు వరకు 50 వేలకు పైగా కాల్స్ వచ్చాయి. వీటిల్లో 3,672 ఫిర్యాదులను స్వీకరించి 3,612 కేసులను పరిష్కరించారు. 2014 నుంచి ఈ ఆగస్టు వరకు ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసిన వారు 1,239 మంది. ఇందులో 2014లో 87 ఫిర్యాదులు, 2015లో 112, 2016లో 124 , 2017లో 286, 2018లో 330 ఫిర్యాదులొచ్చాయి. ఈ ఏడాది 8 నెలల్లోనే 300 కంప్లైంట్స్ అందాయి. జనవరి నుంచి ఆగస్టు చివరి వారం వరకు 240 ఫిర్యాదులను పరిష్కరించిన అధికారులు చాలా మందికి పరిహారం ఇప్పించారు. ఈ ఏడాది వచ్చిన 60 ఫిర్యాదులతో పాటు గతేడాదికి సంబంధించిన 112 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఆరేళ్లలో 4,911 కేసులొస్తే 4,679 పరిష్కారమయ్యాయి. టీఎస్‌సీఐసీకి వచ్చిన కేసుల్లో ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్, ఆటోమొబైల్, టెలికాం సర్వీస్, వ్యాపార సంస్థలు, మొబైల్ సేవలు, హాస్పిటళ్లవే ఎక్కువని అధికారులు చెప్పారు.
ఎలా ఫిర్యాదు చేయాలి?
వినియోగదారుల కేసులపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ హెల్ప్ లైన్ 1800-425-00333కు ఫోన్ చేయొచ్చు. www.consumeradvice.in వెబ్‌సైట్ లోనూ ఫిర్యాదు చేయొచ్చు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లై ఆఫీసుకు వెళ్లి కూడా కంప్లైంట్ చేయొచ్చు. బాధితులు, బాధ్యులను కూర్చోబెట్టి స్నేహపూర్వకంగా మాట్లాడతారు. బాధితులకు జరిగిన నష్టాన్ని వివరించి చట్ట ప్రకారం అందాల్సిన పరిహారం ఇచ్చేలా చూస్తారు. కేసు పరిష్కారమయ్యే చాన్స్ లేకపోతే జిల్లా, రాష్ట్ర కన్జ్యూమర్ కోర్టుకు సిఫార్సు చేస్తారు.