
యూపీఎస్సీతో ఎగ్జామ్స్ నిర్వహించాలి
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన
ముషీరాబాద్/ఓయూ, వెలుగు : గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు కావడంతో తమకు టీఎస్‌పీఎస్సీపై నమ్మకం పోయిందని పోటీ పరీక్షల అభ్యర్థులు అన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి యూపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని కోరారు. శుక్రవారం చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్, సురేష్, రవి తదితరులు మాట్లాడుతూ..కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే టీఎస్‌పీఎస్సీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహణ లోపంతో ఎగ్జామ్స్ రద్దు అవుతుంటే సమయం వృథాతో పాటు ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బుల మీద ఆధారపడి చదువు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇన్ని బాధలు పడుతూ చదువుకుని ఎగ్జామ్స్ రాస్తుంటే టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యంతో అవి రద్దు అవుతున్నాయని చెప్పారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించడం చేతగాని టీఎస్‌పీఎస్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్కు చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డిని తొలగించాలన్నారు. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని ఓయూ స్టూడెంట్స్, నిరుద్యోగులు కూడా డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్లకు తరలించారు.