గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్​

గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్​
  •     త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 
  •     పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రెండు పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు. శుక్రవారం గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్  లిస్టు (జీఆర్ఎల్) ను రిలీజ్ చేశారు. ర్యాంకుల వివరాలను టీఎస్​పీఎస్సీ అధికారిక వెబ్​సైట్​  https://www.tspsc.gov.in లో ఉంచారు. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్  ఉంటుందని కమిషన్  అధికారులు తెలిపారు. రిజెక్ట్  అయిన అభ్యర్థుల ర్యాంకులు ప్రకటించలేదని చెప్పారు. కాగా, గ్రూప్ 4 టాపర్​గా కుమ్రంభీమ్  ఆసిఫాబాద్  జిల్లాకు చెందిన అభ్యర్థి నిలిచాడు. రెండు పేపర్లలో 300 మార్కులకు గాను అతనికి 220.458 మార్కులు వచ్చాయి. వనపర్తికి చెందిన అభ్యర్థి 219.009 మార్కులు, ఆదిలాబాద్  జిల్లాకు చెందిన అభ్యర్థి 217.226 మార్కులతో రెండు, మూడో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్  జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి 1.020 మార్కులు పొంది చివరి ర్యాంకు పొందాడు. ఇక, గ్రూప్ 4 ఎగ్జామ్​లో 200కు పైగా మార్కులు పొందిన అభ్యర్థులు 131 మంది మాత్రమే ఉండడం గమనార్హం. 150కి పైగా మార్కులు పొందిన అభ్యర్థులు 22,214 మంది ఉన్నారు. జీఆర్ఎస్ పొందిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 
అభ్యర్థులు 7,805 మంది ఉన్నారు. 

ఇదీ నేపథ్యం...

రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్​లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్  జారీ చేసింది. దీనికి 9,51,205 మంది అప్లై చేయగా, వారికి నిరుడు జులై 1న పరీక్ష నిర్వహించారు. పేపర్1కు 7,62,872 మంది,  పేపర్2కు  7,61,198 మంది హాజరయ్యారు. ఐదారు నెలల క్రితమే ఫైనల్ కీ విడుదల చేసినా, రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో అప్పట్లో ఫలితాలు విడుదల చేయలేదు. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్  రావడంతో ఆ అంశం పక్కకు పోయింది. తాజాగా కొత్త సర్కారు రావడంతో టీఎస్ పీఎస్సీకి కొత్త కమిషన్  ఏర్పాటు చేసింది. ఆగిన  రిక్రూట్ మెంట్  ప్రక్రియను కొత్త కమిషన్  వేగవంతం చేస్తోంది.  ప్రస్తుతం గ్రూప్ 4లో 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. దీంతో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చి కన్ఫమ్ చేయనున్నారు.