
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను హిమాయత్ నగర్ సిట్ ఆఫీసులో విచారిస్తున్నారు అధికారులు. మార్చి 29వ తేదీ బుధవారం విడతల వారీగా అభ్యర్థులను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఈక్రమంలో 100 మార్కులకు పైగా వచ్చిన వారందరికీ సిట్ నోటీసులు ఇచ్చింది. హిమాయత్ నగర్ సిట్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సిట్.
కాగా, ఈ వ్యవహరంలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, షమీమ్, రమేశ్ అంతా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే. నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత ప్రవీణ్, రాజశేఖర్ కలిసి లీక్‌కు ప్లాన్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చి పేపర్స్ హ్యాక్ చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. అయితే పేపర్ లీకేజీ విషయం షమీమ్, దామెర రమేశ్‌కు తెలియడంతోనే వారికి కూడా షేర్ చేసినట్లు బయటడింది.
గ్రూప్–1 పేపర్ ప్రవీణ్ నుంచి షమీమ్‌కు, రాజశేఖర్ నుంచి దామెర రమేశ్‌కు, రాజశేఖర్ బావ ప్రశాంత్‌రెడ్డికి చేరినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.పేపర్ లీక్ తర్వాతనే ప్రశాంత్‌రెడ్డి న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వచ్చి పరీక్ష రాసినట్లు ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో క్వాలిఫై కాని వారికి కూడా పేపర్ లీక్ విషయం తెలుసా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నది.