
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ గురువారం గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 డిపార్ట్మెంట్లలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. గురువారం కమిషన్ కార్యాలయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశం జరిగింది.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు, అర్హతలు, జీతం, రిజర్వేషన్లు తదితర వివరాలన్నీ ఈ నెల 23న టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పెడ్తామని అధికారులు ప్రకటించారు. మొదట డిసెంబర్ నెలాఖరులో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినప్పటికీ, అభ్యర్థుల ప్రిపరేషన్‌కు మరింత టైమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు. గ్రూప్4 పోస్టులకు డిగ్రీ పూర్తి చేసినోళ్లే అర్హులని చెబుతున్నారు.
ఆ మూడింటిలోనే ఎక్కువ పోస్టులు..
25 డిపార్ట్మెంట్లకు చెందిన 97 హెచ్ఓడీల పరిధిలోని 9,168 పోస్టులను 4 కేటగిరీలుగా విభజించారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859 (పంచాయతీరాజ్‌లో 1,245, రెవెన్యూలో 2,077 తదితర), వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429 (ఫైనాన్స్‌లో 191, మున్సిపల్లో 238), జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి. ఇందులో సగానికి పైగా మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ల నుంచే ఉన్నాయి. కాగా, గ్రూప్ 2 నోటిఫికేషనే ముందు వస్తుందని అందరూ భావించారు. గ్రూప్ 4 పోస్టులు ఎక్కువగా ఉండటంతో టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ ముందుగా ఇచ్చింది. ప్రిపరేషన్‌కు 5 నెలల టైమ్ ఉండడంతో అభ్యర్థులంతా కోచింగ్ సెంటర్ల బాట పట్టనున్నారు.
ఇవీ గ్రూప్ 4 పోస్టులు..
డిపార్ట్ మెంట్ పోస్టులు
మున్సిపల్(ఎంఏయూడీ) 2,701
రెవెన్యూ 2,077
పంచాయతీరాజ్ 1,245
హయ్యర్ ఎడ్యుకేషన్ 742
సెకండరీ ఎడ్యుకేషన్ 97
ఎస్సీ వెల్ఫేర్ 474
మెడికల్ అండ్ హెల్త్ 338
బీసీ సంక్షేమశాఖ 307
ఫైనాన్స్ 255
గిరిజన సంక్షేమ శాఖ 221
మైనార్టీ సంక్షేమ శాఖ 191
హోంశాఖ 133
కార్మిక శాఖ 128
సివిల్ సప్లయ్స్ 72
ఇరిగేషన్ 51
అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ 44
అటవీశాఖ 23
ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ 20
మహిళా, శిశు సంక్షేమం 18
యువజన సర్వీసులు 13
ఇండస్ర్టీ 7
జీఏడీ 5
పశుసంవర్థక, డెయిరీ, ఫిషరీస్ 2
విద్యుత్ శాఖ 2
ప్లానింగ్ డిపార్ట్మెంట్ 2