- అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
- నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్స్‌తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష, నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్3 ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. తాజాగా అక్టోబర్ 21 నుంచి గ్రూప్1 మెయిన్స్ ఉంటాయని వెల్లడించింది.
ప్రతీ పరీక్షకు మధ్య గ్యాప్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. కాగా, 2022లో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదలైనా ఇప్పటి వరకూ పరీక్ష నిర్వహించలేదు. ఇదే విషయమై ‘గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ ఇంకెన్నడు?’ శీర్షికతో వారం క్రితం ‘వెలుగు’లో ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై సర్కారు, టీఎస్పీఎస్సీ స్పందించింది. ఈ క్రమంలోనే కొత్త తేదీలను కమిషన్ ప్రకటించింది. గ్రూప్స్ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించడంపై నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
గ్రూప్-2 పరీక్ష తేదీలు.. ఇది నాలుగోసారి
రాష్ట్రంలో 783 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించినా, ఆ తర్వాత వాయిదాపడింది. అనంతరం నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించినా, అప్పుడూ అసెంబ్లీ ఎన్నికలతో పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. ఆ తర్వాత జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన కమిషన్ మూడోసారి కూడా వాయిదా వేసింది. తాజాగా, నాలుగోసారి ఆగస్టు 6,7 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
14 నెలల తర్వాత గ్రూప్-3 పరీక్ష తేదీలు
రాష్ట్రంలో1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత మరిన్ని పోస్టులను కలిపి మొత్తం 1,388 గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, పరీక్షా తేదీని మాత్రం ప్రకటించలేదు. కొత్త కమిషన్ వచ్చిన తర్వాత తాజాగా నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ పెడతామని వెల్లడించింది. అంటే నోటిఫికేషన్ రిలీజైన సుమారు 14 నెలల తర్వాత గ్రూప్ 3 పరీక్షా తేదీలు ప్రకటించడం గమనార్హం.
