
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర, జిల్లా స్థాయి రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ.800 కోట్లు అవసరమని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్ ఆర్డీసీ) తెలిపింది. ఈ నిధులను ఏదైనా బ్యాంకు నుంచి లోన్ ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌లో టీఎస్ ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ఆధ్యక్షతన తొలిసారి రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ బోర్డు 14వ సమావేశం జరిగింది. ఇందులో ఆర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ సెక్రటరీ టీకే శ్రీదేవి, కార్పొరేషన్ ఎండీ, ఈఎన్‌సీ రవీందర్‌రావు, రూరల్ రోడ్స్ సీఈ పింగళి సతీశ్‌తో పాటు ఎస్‌బీఐ నుంచి ఒక ప్రతినిధి హాజరయ్యారు. సమావేశంలో టీఎస్ ఆర్డీసీకి సంబంధించిన 2022–-23 వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణంపై బోర్డు సుదీర్ఘంగా చర్చించింది. ఈ రోడ్ల నిర్మాణానికి రూ.800 కోట్లు రుణం తీసుకోవాలన్న చైర్మన్ ప్రతిపాదనకు బోర్డు అంగీకరించింది. ఈ మేరకు పలు ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్లు, బ్యాంకులను సంప్రదించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. నిధుల సమీకరణకు సమగ్ర ప్రాజెక్టు(డీపీఆర్)ను తయారు చేయాలని సంబంధిత శాఖ అధికారులను చైర్మన్ శ్రీనివాస్ ఆదేశించారు.