పురుషులకు మాత్రమే!!..స్పెషల్ బస్సులు ప్రారంభించిన ఆర్టీసీ

పురుషులకు మాత్రమే!!..స్పెషల్ బస్సులు ప్రారంభించిన ఆర్టీసీ
  • ఎల్బీనగర్ , ఇబ్రహీంపట్నం రూట్లలో స్టార్ట్
  • మహాలక్ష్మి’తోపెరిగిన మహిళా ప్రయాణికులు 
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన సంస్థ

హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.  దీంతో  బస్సులో రద్దీ బాగా పెరిగింది. చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. రద్దీ పెరగడంతో కొన్నిసార్లు మహిళా ప్రయాణికుల మధ్య గొడవలు జరిగి.. సిగలు పట్టుకొని కొట్టుకొనే దాకా వెళ్తున్నాయి. కండక్టర్ల పై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. 

దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే..మహిళలతో పాటు పురుషులకు సైతం ఇబ్బంది కరంగా మారింది. బస్సుల్లో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రద్దీ ఎక్కువ ఉన్న రూట్ల లో లేడీస్ స్పెషల్ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ.. పురుషుల కోసం కూడా స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి సిటీలో రద్దీ ఎక్కువగా ఉన్న ఎల్బీ నగర్ , ఇబ్రహీంపట్నం రూట్ లో జెంట్స్ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 ట్రిప్పులు నడపనున్నట్లు వెల్లడించారు. త్వరలో మరిన్ని రూట్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు చెప్పారు.