ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ధర్నా.. రెండు గంటల పాటు డిపోల్లోనే బస్సులు

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ధర్నా.. రెండు గంటల పాటు డిపోల్లోనే బస్సులు

రాష్ట్రంలో రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు  డిపోలకే పరిమితం అయ్యాయి. టీఎస్ఆర్టీసీని   ప్రభుత్వంలో  విలీనాన్ని గవర్నర్ అడ్డుకుంటున్నారంటూ  ఆర్టీసీ  కార్మికులు, ఉద్యోగులు ఆగస్టు 05వ తేదీన రెండు గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.   కార్మికులంతా డ్యూటీ టైమ్ కి డిపోలకు వచ్చినా.. బస్సులు బయటకు రాలేదు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా డిపోల ముందు  నిరసన ప్రదర్శనలు చేపట్టారు.  డిపోలముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. బోధన్, ఆర్మూర్ ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన  చేపట్టారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లుకు  గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. 

అటు కొమురం భీం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు.  ఆసిఫాబాద్ బస్ డిపో బస్సులను ఉదయం 6గంటల నుండి 8 గంటల వరకు బంద్ చేశారు.  రెండు గంటల పాటు డిపో ఎదుట ధర్నా చేశారు. 
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్టీసీ డిపో ముందు  ఆర్టీసీ కార్మికులు నిరసన నిర్వహించారు. రెండు గంటల పాటు బస్సులు నిలిపి వేయడంతో  ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా గవర్నర్ అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో ముందు కార్మికుల ధర్నా నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోలో కార్మికులు బస్సులను నిలిపివేశారు. నల్ల బ్యాడ్జిలతో  నిరసన తెలిపారు. ఆర్టీసీ విలీనం బిల్లుపై సంతకం చేయకుండా గవర్నర్ తమిళిసై చేస్తున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ బస్టాండ్ లలో ఆర్టీసీ కార్మికులు బస్సులను ఆపేశారు.   ప్లాట్ ఫామ్  పైన బస్సులను నిలిపి నిరసన తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి  8 గంటల వరకు ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 

ఖమ్మం ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని  గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 
నల్ల బ్యాడ్జీలు ధరించి గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ విలీనాన్ని అడ్డుపడితే రాజ్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించక పోవడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు రెండు గంటల పాటు బస్సులు నిలిపివేశారు. రెండు గంటల పాటు బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 

వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో  ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను గవర్నర్ ఆమోదించడం లేదని ఆరోపించారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా తాండూరు బస్ డిపో దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో RTC కార్మికులు ధర్నాకు దిగారు.  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని ఆర్టీసీ  డిపో ఎదుట  కార్మికులు నిరసనకు దిగి విధులను బహిష్కరించారు.బస్సుల నడవకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.