వచ్చే నెలలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు.. సిటీ రోడ్లపై నడిపేందుకు ఏర్పాట్లు

వచ్చే నెలలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు.. సిటీ రోడ్లపై నడిపేందుకు  ఏర్పాట్లు
  • తొలి దశలో ఐటీ సెక్టార్, ఎయిర్ పోర్ట్ రూట్ లో సర్వీసులు
  • ముందుగా అందుబాటులోకి 50 ఏసీ బస్సులు
  • ఆ తర్వాత  ఆర్డినర్సీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లు
  • చార్జింగ్ స్టేషన్లకు గ్రేటర్ లో 15 డిపోలు ఎంపిక
  • కొత్త బస్సుల్లో కామన్ మొబిలిటీ కార్డు ఫెసిలిటీ

హైదరాబాద్ , వెలుగు: సిటీ రోడ్లపైకి త్వరలో ఎలక్ర్టిక్ బస్సులు రానున్నాయి. తొలిదశలో ఐటీ సెక్టార్‌‌తో  పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.  వచ్చే నెలలో సుమారు 50  బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఏసీ బస్సులను నడపనుండగా.. ఆ తర్వాత ఆర్డినర్సీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ రూట్‌లో 40 ఏసీ పుష్పక్ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వీటికి ప్యాసింజర్ల నుంచి ఫుల్ డిమాండ్ ఉందని, అవి సరిపోవటం లేదంటున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్లు ఉన్నా  కేవలం సికింద్రాబాద్‌తో పాటు రెండు మూడు ప్రాంతాలకే బస్సులను ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. 

ఐటీ రూట్ లో పుల్ డిమాండ్ 

ఐటీ కారిడార్ రూట్‌లో ఏసీ బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. గతంలో నడిచిన మెట్రో లగ్జరీ బస్సులు ఇప్పుడు నడవటం లేదు.  సైబర్ లైనర్స్ పేరుతో ఆర్టీసీ నడుపుతున్న బస్సులకు ఫుల్ డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. రాయదుర్గం వరకే మెట్రో రైలు సదుపాయం ఉంది. అక్కడి నుంచి వేవ్ రాక్, నానక్ రాంగూడ, క్యూ సిటీ, ఇనార్బిట్ ప్రాంతాలకు ఎలక్ర్టిక్ బస్సులను నడపనున్నారు.  లింగంపల్లి, ఉప్పల్, మియాపూర్, హయత్ నగర్,  కొంపల్లి రూట్ల నుంచి  ఐటీ కారిడార్ కు నడిపేందుకు అధికారులు ప్లాన్ రూపొందించారు. 

కామన్ మొబిలిటి కార్డ్ అమలు

వచ్చే నెల రెండో వారం నుంచి గ్రేటర్‌‌లో  మెట్రో, ఆర్టీసీలో చెల్లుబాటు అయ్యే విధంగా మెట్రో మొబిలిటి కార్డ్ ను జారీ చేయాలని ఆర్టీసీ, మెట్రో అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎలక్ర్టిక్ బస్సులు లాంచ్‌ చేసి అందులో ఈ కార్డ్ అమలును స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.  పైలెట్ ప్రాజెక్టుగా  స్టార్ట్ ప్యాసింజర్ల రెస్పాన్స్, లోపాలు, మార్పులు, సవరణలను పరిగణలోకి తీసుకొని సిటీలో అన్ని సర్వీసుల్లో ఈ కార్డ్ ను అందుబాటులోకి తేనున్నారు. 

చార్జింగ్ స్టేషన్లకు డిపోల ఎంపిక 

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో కంటోన్మెంట్‌తో పాటు మియాపూర్ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.  ఇక్కడి నుంచే ఎయిర్‌‌పోర్ట్ కు నడిచే పుష్పక్ బస్సులకు చార్జింగ్ సౌకర్యం ఉంది. రానున్న రోజుల్లో ఎలక్ర్టిక్ బస్సుల సంఖ్య పెరగనుండగా చార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.  ఇందుకు 15 డిపోలను అధికారులు ఎంపిక చేశారు.  ఆయా డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను నిర్మాణాలకు పనులు ప్రారంభించారు.  

మొత్తం 550  బస్సులు

ఈ ఫైనాన్సియల్ ఇయర్ లో మొత్తం 550 ఎలక్ట్రిక్  బస్సులు ఆర్టీసీకి రానున్నాయి.  ఇందుకు మెగాకు చెందిన ఒలెక్ర్టాకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.  ఈ ఏడాది చివరిలోగా ముందుగా 300 బస్సులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ధరలు నిత్యం పెరుగుతున్న నేపథ్యంలో వస్తున్న రెవెన్యూలో ఎక్కువ ఆయిల్‌కే ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. 2025 సంవత్సరం నాటికి  మొత్తం 3600 ఎలక్ర్టిక్ బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ ఇప్పటికే నిర్ణయించింది.  ఒలెక్ర్టాతో పాటు మరో 3 కంపెనీలు ఆర్టీసీ ఈ బస్సులను సరఫరా చేయనుంది.  వెయ్యి బస్సుల సరఫరాకు మొత్తం 3 కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. 

విజయవాడ రూట్ లో రన్నింగ్ 

ఒలెక్ర్టా నుంచి ఇటీవల 10 బస్సులు వచ్చాయి. వాటికి ఈ– గరుడ పేరు పెట్టారు. వీటిని ఎక్కువ రష్ ఉండే హైదరాబాద్ – విజయవాడ రూట్ లో ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ రూట్‌లో చార్జింగ్ పెట్టిన తర్వాత సూర్యాపేట  వద్ద చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. బస్సుకు ఒక్కసారి చార్జింగ్ పెడితే 325 కి.మీ మైలేజ్ వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సిటీలో 15 డిపోల్లో ఏర్పాటు చేసిన తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండలో కూడా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.