
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
వెంటనే వేతన సవరణ చేపట్టాలి
ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో సమస్యల పరిష్కారానికి, సంస్థ పరిరక్షణకు రెండు రోజుల్లో సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహన్, అధ్యక్షుడు ఎస్. బాబు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లోని బస్‌భవన్ నుంచి ఇందిరాపార్క్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. తర్వాత సభలో వారు మాట్లాడుతూ ఆర్టీసీలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి ఏడాదైనా ఎన్నికలు జరిపించే తీరిక ప్రభుత్వానికి, లేబర్ డిపార్ట్‌మెంట్‌కు లేదన్నారు.
పబ్లిక్ రంగ సంస్థల్లోని వాటాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా నియామయాల్లేక కార్మికులపై భారం పెరిగిందన్నారు. గ్యారేజ్ కార్మికులకు 21 రోజులకే ఇన్సెంటివ్ క్లాజ్ అమలు చేయాలని, శ్రామిక్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, మహిళా కండక్టర్లకు ప్రత్యేక చార్టులివ్వాలని, రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్ ఇవ్వాలని కోరారు.