రాఖీ పండుగ 3 రోజులు.. 3 వేల ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రాఖీ పండుగ 3 రోజులు.. 3 వేల ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది.  రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు. ఈ స్పెషల్ బస్సులు  2023 ఆగస్టు  29, 30, 31 తేదీల్లో ప్రతిరోజు 1000 బస్సుల చొప్పున నడపనున్నట్లుగా వెల్లడించారు. 

రాఖిపౌర్ణమి బస్సు సర్వీసుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సజ్జనార్... ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, సకాలంలో సర్వీసులను నడపాలని అధికారులను ఆదేశించారు.  రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

గతేడాది అధికారులు సమిష్టిగా పనిచేశారని దాని ఫలితంగా ఒక రోజే రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందని గుర్తు చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తరువాత సంస్థపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు నిబద్దతతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.