పందెం కోడి బతికిపోయింది!.. బ్లూక్రాస్కు అప్పగించిన ఆర్టీసీ

పందెం కోడి బతికిపోయింది!.. బ్లూక్రాస్కు  అప్పగించిన ఆర్టీసీ

కరీంనగర్ సిటీ, వెలుగు:  కరీంనగర్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించాల్సిన పందెం కోడి వేలంలో బిగ్ ట్విస్ట్​ చోటుచేసుకుంది. వేలంపాటను ఆపేందుకు ఏకంగా హైదరాబాద్ నుంచి బ్లూక్రాస్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగారు. పందెం కోడిని వేలం వేయడం జంతు/పక్షి సంరక్షణ చట్టాలకు విరుద్ధమని వారితో పాటు పశుసంవర్థక శాఖ ఆఫీసర్లు హెచ్చరించడంతో ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో వేలాన్ని రద్దు చేశారు. 

ఈ ఊహించని ట్విస్టుతో వేలంపాటలో పందెం కోడిని ఎలాగైనా దక్కించుకోవాలని వచ్చిన 20 మంది ఔత్సాహికులు, వారితో పాటు ఆ వేలాన్ని చూసేందుకు వచ్చిన వాళ్లు నిరాశ చెందారు. చివరికి ఆ పందెం కోడి బ్లూక్రాస్ సంస్థకు చేరింది. 

బస్సులో ప్యాసింజర్ మరిచిపోవడంతో.. 

ఈ నెల 9న ఆర్టీసీ కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సులో గుర్తు తెలియని ప్యాసింజర్ పందెం కోడిని మరిచిపోయారు. ఆ కోడిని గమనించిన కండక్టర్.. దాన్ని డిపోలో అప్పగించారు. దీంతో రెండ్రోజులు కోడికి దాణా వేసి సంరక్షించిన ఆర్టీసీ అధికారులు.. దాని యజమాని కోసం ఎదురుచూశారు. అయితే ఎవరూ రాకపోవడంతో శుక్రవారం కోడిని వేలం వేయనున్నట్టు గురువారం ప్రకటించారు. దీంతో పందెం కోడి వార్త వైరల్ అయింది. ఇది చూసి నెల్లూరు జిల్లాకు చెందిన తాపీమేస్త్రీ.. కోడి తనదేనంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

తాను సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కన్ స్ట్రక్షన్ పనులు చేయిస్తుంటానని, ఆంధ్రాకు వెళ్లే క్రమంలో కోడిని కరీంనగర్ లో మరిచిపోయానని ఆ వీడియోలో అతను పేర్కొన్నాడు. అంతేగాక కోడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టికెట్ కూడా షేర్ చేశాడు. అతడి తరఫున కోడిని తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు. 

దీంతో కోడిని అతడికి అప్పగిస్తారా? వేలం వేస్తారా ? అని అందరూ చర్చించుకుంటుండగా... పశుసంవర్థక శాఖ, బ్లూక్రాస్ ప్రతినిధుల హెచ్చరికలతో వేలాన్ని నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో వేలంపాటలో పాల్గొనేందుకు డిపో దగ్గరికి వచ్చిన దాదాపు 20 మంది నిరాశకు గురయ్యారు. చివరికి ఆ కోడిని హైదరాబాద్‌‌ కు చెందిన బ్లూక్రాస్‌‌ ప్రతినిధి నారాయణకు అధికారులు అప్పగించారు. మాదాపూర్ లోని బ్లూ క్రాస్ జంతు/పక్షి సంరక్షణ కేంద్రంలో పందెం కోడిని సంరక్షించనున్నట్లు నారాయణ తెలిపారు.