ఓజీఎల్కు టీఎస్ఆర్టీసీ 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్

ఓజీఎల్కు  టీఎస్ఆర్టీసీ 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్

హైదరాబాద్, వెలుగు: ఒలెక్ట్రా గ్రీన్​టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు టీఎస్ఆర్టీసీ 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్​టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్ ​సిటీ బస్సులను సంస్థకు అందజేయనుంది. ఈ ఆర్డర్ సౌతిండియాలోనే అతి పెద్దదని ఓజీఎల్ సీఎండీ కేవీ ప్రదీప్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డర్​లో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్ ​సిటీ కోచ్ ఈ–బస్సులున్నాయని వివరించారు. విజయవాడకు వెళ్లే బస్సులు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని తెలిపారు. హైదరాబాద్​లో తిరిగే బస్సులను  ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కి.మీ కంటే ఎక్కువ దూరం వెళ్తాయని పేర్కొన్నారు. బస్సులను దశలవారీగా అందజేస్తామని తెలిపారు. ఆర్టీసీతో ఒలెక్ట్రా అనుబంధం 40 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్​తో మార్చి 2019లోనే ప్రారంభమైందని తెలిపారు. 

వచ్చే రెండేండ్లలో 3,400 బస్సులొస్తయ్​

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మరిన్ని ఎలక్ట్రిక్​ బస్సులకు ఆర్డర్​ ఇచ్చామని ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ అన్నారు. వచ్చే రెండేండ్లలో 3,400 ఎలక్ట్రిక్​ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తున్నదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.