
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బస్సులు నడిపామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులు నడిపామని పేర్కొన్నారు. ఇందులో 1,127 హైదరాబాద్ సిటీ బస్సులను రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం రూట్లల్లో తిప్పామని ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు.
మొత్తం 52.78 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేశామని, ఇందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నారని ఆయన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11, 12, 13 తేదీల్లో మొత్తం 4,400 స్పెషల్ బస్సులను నడిపామని తెలిపారు. శనివారం వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులు నడిపామని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వరకు 500 బస్సులను నడిపామన్నారు.