టీఎస్​ఆర్టీసీ అద్దిరిపోయే ​న్యూస్.. ఇక మీ పాకెట్లో రూ.30 సేవ్​

టీఎస్​ఆర్టీసీ అద్దిరిపోయే ​న్యూస్..  ఇక మీ పాకెట్లో రూ.30 సేవ్​

రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. టీ9-(30)పేరుతో కొత్త సబ్సిడీ స్కీంని తీసుకొచ్చింది. జులై 27 నుంచే ఈ పథకం అమలు కానున్నట్లు అధికారులు తెలిపారు. 

తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం తీసుకొచ్చిన ఈ స్కీంతో చాలా మంది బెనిఫిట్​ పొందనున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.  

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ తదితరులు జులై 26న  విడుదల చేశారు.  అయితే పథకం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి పొడిగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. 

ఈ పథకం కీ పాయింట్స్​ ఇవే.. 

  • పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
  • టీ9-(30) టికెట్‌కు  రూ.50 చెల్లిస్తే 30 కి.మీ పరిధిలో రానుపోను వెసులుబాటుంటుంది.
  • ఉదయం 9  నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. 
  • బస్సు కండక్టర్ల వద్ద టికెట్‌ అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే  దీన్ని జారీ చేస్తారు.
  • 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుంది.  దీని ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30  వరకు ఆదా అవుతుంది.  తిరుగుప్రయాణంలో రూ.20 ఇచ్చి కాంబో టికెట్​ తీసుకుంటే ఎక్స్​ప్రెస్​బస్సుల్లోనూ ట్రావెల్ చేయవచ్చు. 
  • పూర్తి వివరాలకు  టీఎస్​ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040 - 69440000, 040 - 23450033 లలో సంప్రదించవచ్చు.

ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టీ9-(60) టికెట్‌ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌  ప్రకటించారు.  

పల్లె వెలుగు బస్సుల్లో రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్థిక భారం తగ్గించాలనే  ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఆర్టీసీ తెస్తున్న ఈ నయా రాయితీలు పబ్లిక్​ ను ఆకట్టుకుంటున్నాయి.