టీఎస్ఆర్టీసీ రికార్డు... ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను నడిపింది

 టీఎస్ఆర్టీసీ రికార్డు... ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను నడిపింది

సంక్రాంతికి TSRTC బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..  ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న(జనవరి 13) ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపినట్లు ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు. 1861 ప్రత్యేక బస్సుల్లో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పడం జరిగిందన్నారు.. సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదిల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడపగా.. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపినట్లు చెప్పారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పిందని తెలిపారు. 

శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారని... అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారన్నారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందన్నారు. తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచాని ఆయన తెలిపారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సజ్జనార్ చెప్పారు.