
హైదరాబాద్ , వెలుగు : పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్లపై ఆర్థిక భారం తగ్గించేందుకు తీసుకొచ్చిన "టీ 9 టికెట్" టైమింగ్స్ లో ఆర్టీసీ మార్పులు చేసింది. ఇకనుంచి ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని శుక్రవారం ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ఆదివారం(ఈ నెల 9) నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్యాసింజర్ల అభ్యర్థనల మేరకు టికెట్ టైమింగ్స్ పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది.
రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రాను పోనూ జర్నీ చేసే అవకాశం ఉండగా.. తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుందని చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను అందిస్తున్నారు. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టీ-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
పండరీపూర్ కు బస్సు
మహారాష్ర్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరీ పూర్ కు ఆర్టీసీ శనివారం నుంచి బస్సు సర్వీసును స్టార్ట్ చేయనుంది. ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.40 కి చేరుకుంటదని హైదరాబాద్ 1 డిపో డీఎం కృష్ణారెడ్డి తెలిపారు. రాత్రి 8 గంటలకు బయల్దేరి ఉదయం 4.25 వరకు వస్తుందని ఆయన తెలిపారు. కావున పాండురంగస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే ప్యాసింజర్లు సర్వీస్ ను వినియోగించుకోవాలని కోరారు. టికెట్ ధర ఎంజీబీఎస్ నుంచి రూ.637గా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.