ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

హైదరాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతున్నామని రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 4198 బస్సులను నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని  ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ నుంచే కాకుండా హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రాంతాలైన కోఠి, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ నుంచి జిల్లాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణలో దసరా, బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి అక్టోబర్ చివరి వారంలో మొదలయ్యే దసరా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం  విద్యా సంస్థలకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగం, వ్యాపార అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రజలు పండగ రోజుల్లో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 30 నుంచి  ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.