ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి: టీజేఎస్ చీఫ్ ప్రొ కోదండరాం

ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి: టీజేఎస్ చీఫ్  ప్రొ కోదండరాం

ఎల్బీనగర్, వెలుగు: ఆర్టీసీలో కార్మికుల యూనియన్లను పునరుద్ధరించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం ఎల్బీనగర్​లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం కార్మికుల సమస్యలపై ప్రశ్నించేందుకు వీలు లేకుండా యూనియన్లను రద్దు చేసిందని విమర్శించారు.

ఏ రంగంలోనైనా కార్మికులకు యూనియన్ ప్రాణవాయువు లాంటిదని చెప్పారు. ఉద్యోగులపై వేధింపులను నివారించేందుకు యూనియన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం తెలంగాణ మహిళా లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని వెల్లడించారు. కార్మికులకు రావాల్సిన వేతన సవరణ కొంత కాలంగా పెండింగ్ లో ఉందని వివరించారు. పెండింగ్ లోని రెండు వేతన సవరణలను విడుదల చేయాలని కోరారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కాదని.. ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు మాత్రమేనని కోదండరాం మండిపడ్డారు. ఆ తర్వాత అశ్వత్థామ రెడ్డి మాట్లాడారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, ఎల్బీ నగర్ ఇన్ చార్జ్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.