కరెంట్ మీటర్ పెట్టమంటే లంచం అడిగాడు : అసిస్టెంట్ ఇంజినీర్ అరెస్ట్

కరెంట్ మీటర్ పెట్టమంటే లంచం అడిగాడు : అసిస్టెంట్ ఇంజినీర్ అరెస్ట్
  • మీటర్ కావాలంటే రూ.3,500 లంచం ఇవ్వాల్సిందే

హైదరాబాద్,వెలుగు:  కరెంట్ మీటర్ కి అనుమతి ఇవ్వడం కోసం దరఖాస్తుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసిన మియాపూర్ టీఎస్ ఎస్పీడీసీఎల్ లో పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. గతంలోనూ ఓసారి లంచం తీసుకుంటూ పట్టబడ్డా బుద్ధిమారని సదరు అధికారి హోదా పెరిగాక తాజాగా మరోసారి దొరికిపోయాడు. ఈ సారి తన చేతికి ఏసీబీ నోట్ల రంగు అంటకుండా కింద పనిచేసే ఉద్యోగిని మధ్యవర్తిగా పెట్టి లంచం తీసుకున్నాడు.

రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్ భవ్యశ్రీ అపార్ట్ మెంట్ కి చెందిన తంగళ్లపల్లి కిశోర్ సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇందుకోసం భవ్యశ్రీ అపార్ట్ మెంట్ లో కరెంట్ మీటర్ కోసం మియాపూర్ టీఎస్ ఎస్పీడీసీఎల్ లో అప్లయ్ చేసుకున్నాడు. కరెంట్ మీటర్ కు అనుమతి ఇవ్వడం కోసం అక్కడే పనిచేస్తున్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ డి.రమేశ్ లంచం డిమాండ్ చేశాడు.  మీటర్ బిగించకుండా వేధిస్తున్న రమేష్ డిమాండ్ తో చివరకు రూ.3,500 లు లంచం ఇచ్చేందుకు కిశోర్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

ఏసీబీ అధికారులు దీనిపై కేసు నమోదు చేసుకుని..పక్కా ప్లాన్ ప్రకారం రమేశ్ డిమాండ్ చేసిన లంచం డబ్బును తీసుకుంటున్న సబ్ ఇంజినీర్ కె.పాండును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పాండు ఇచ్చిన వాంగ్మూలంతో లంచం డిమాండ్ చేసిన ఏడీఈ రమేశ్​ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రమేశ్, పాండు ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడీఈ రమేశ్​ గతంలో బాచుపల్లిలో సబ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సమయంలోనూ ఇదే తరహాలో అరెస్టు అయ్యాడని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి తరలించారు.

గోషామహాల్ లో

ఓ కాంట్రాక్టు కార్మికుడు వద్ద లంచం తీసుకుంటూ… వాటర్ బోర్డు అధికారి ఏసీబీకి పట్టబడిన ఘటన గోషామహల్ లో జరిగింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోషామహల్ లోని వాటర్ బోర్డులో ఎండీ. అహ్మద్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అదే డివిజన్ లోని ఉప్పుగూడకి చెందిన కృష్ణ డ్రైనేజీ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు రూ.2లక్షలు కృష్ణ పేరు మీద వచ్చాయి. ఆ డబ్బులు మంజూరు కావడానికి కృష్ణ సూపరింటెండెంట్ అహ్మద్ దగ్గరికి వెళ్లగా..రూ.5వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు కృష్ణ, అతడి భార్య అరుణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు సూపరింటెండెంట్ కృష్ణ రూ.5వేలు లంచం తీసుకుంటుండగా..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు అహ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.