
తిరుమల: హనుమంతుడి పుట్టినింటిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్లారిటీ ఇచ్చేసింది. ఏడుకొండల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తేల్చి చెప్పింది. బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర శర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. అంజనాద్రిలోని జపాలీ తీర్థంలో హనుమంతుడు పుట్టాడని చెప్పారు. నాలుగు నెలల పాటు లోతైన అధ్యయనం చేశాకే ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. ఆంజనేయుడి జన్మస్థలంపై టీటీడీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కమిటీలోని పండితులంతా ఆ విషయంపై స్టడీ చేసి అంజనీ పుత్రుడు అంజనాద్రిలోనే పుట్టాడని తేల్చారు. అందుకు బలమైన ఆధారాలనూ సేకరించారు. శాసన, ప్రాంతీయ, పౌరాణిక ప్రమాణాలతో ఆధారాలు సేకరించామని మురళీధర శర్మ చెప్పారు. వెంకటాచలంపై పౌరాణిక ఇతిహాసాలనూ ఆధారంగా తీసుకున్నామని, దానికి అంజనాద్రి సహా 20 పేర్లున్నాయని చెప్పారు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోని అంజనాద్రిలోనే పుట్టాడని చెప్తున్నాయన్నారు. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న నాసిక్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర వంటివేవీ అంజనాద్రి కాదని తేల్చి చెప్పారు.