టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : టీటీడీ చైర్మన్ భూమన

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : టీటీడీ చైర్మన్ భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలను అందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వడమలపేట వద్ద ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, ఉద్యోగుల సంఘాల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. సెప్టెంబర్ 18న సీఎం జగన్ ఇళ్ల స్థలాలను పంపిణీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. అవసరమైతే మరో వంద ఎకరాలు   ప్రభుత్వం నుంచి సేకరించి స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన కృషితో ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పదేళ్ల పాటు ఈ సమస్యలను ఎవరు పట్టించుకోలేదని అన్నారు. జగన్ సీఎంగా ఉండటం వల్లే మళ్లీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు వస్తున్నాయని అన్నారు.ఉద్యోగులకు ఒక్కోక్కరికి 35×55 అడుగుల ఇంటి స్థలాలు అందించనున్నట్లు చెప్పారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటిస్థలాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కచ్చా రోడ్లు వేసి తుడా అనుమతి తీసుకొనే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.