శ్రీవారి మండపాన్ని కూల్చింది మళ్లీ కట్టడానికే

శ్రీవారి మండపాన్ని కూల్చింది మళ్లీ కట్టడానికే

తిరుమల పాపవినాశనం మార్గంలోని పారువేట మండపం జీర్ణావస్థకు చేరుకోవడంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ప్రతిఏటా పారువేట ఉత్సవం, కార్తీక వనభోజనాల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఈ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. మండపం కూలిపోయే స్థితికి చేరుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే భక్తులు ఇబ్బందిపడాల్సి వస్తుందని తెలిపింది.

 ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి టీటీడీ ధర్మకర్తల మండలి 2022 జూలై 11వ తేదీన మండపం జీర్ణోద్ధరణ కోసం రూ.2.07కోట్లు మంజూరు చేసిందని వెల్లడించింది.  ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో జూలై 4, 2023 నుండి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించామని తెలిపింది.  అయితే కొందరు వ్యక్తులు పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ తెలిపింది. 


భక్తులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.  పవిత్రమైన ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం చేస్తూ భక్తుల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.