అయోధ్యలోనూ శ్రీవారి ఆలయానికి స్థలం ఇవ్వాలె

అయోధ్యలోనూ శ్రీవారి ఆలయానికి స్థలం ఇవ్వాలె
  • రామ జన్మభూమి ట్రస్టును కోరాం
  • జమ్మూలో టీటీడీ గుడి నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తం
  • టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: జమ్మూలో టీటీడీ నిర్మించనున్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయోధ్యలో కూడా టీటీడీ దేవస్థానానికి స్థలం కేటాయించాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టును కోరామన్నారు. కమిటీ నుంచి వచ్చే స్పందన మేరకు అక్కడ ఆలయం లేదా భజన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలోని టీటీడీ ఆలయ సలహా మండలి చైర్‌‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాదిలో శ్రీవారి ఆలయాల విస్తరణకు ఢిల్లీ సలహా మండలి కృషి చేస్తుందన్నారు. ఢిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల టీటీడీకి ఆలయాలున్నాయని తెలిపారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలాగే, ఉత్తరాదిలోనూ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.