టీటీడీ కీలక నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌రో 500 ఆల‌యాల నిర్మాణానికి శ్రీ‌కారం

టీటీడీ కీలక నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌రో 500 ఆల‌యాల నిర్మాణానికి శ్రీ‌కారం

తిరుపతి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో విడ‌త‌లో 500 ఆల‌యాల నిర్మాణానికి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్, సంస్కృతి సంవ‌ర్ధిని సంస్థ‌ల ద్వారా శ్రీ‌కారం చుట్టాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ఆయా సంస్థ‌ల‌ ప్ర‌తినిధులు, హెచ్‌డిపిపి అధికారుల‌తో టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తిరుప‌తి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌మ కార్యాల‌యంలో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ… ఏపిలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్, తెలంగాణ‌లో సంస్కృతి సంవ‌ర్ధిని సంస్థ‌ల ద్వారా 500 ఆల‌యాల నిర్మాణానికి అనుమ‌తి కోసం రాబోయే హెచ్‌డిపిపి కార్య‌వ‌ర్గ‌ స‌మావేశానికి ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని ఈవో చెప్పారు. నూత‌నంగా నిర్మించే ఒక్కో ఆల‌యానికి టిటిడి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌మ‌కూర్చ‌నుంద‌ని ఈవో వెల్ల‌డించారు. ఆల‌యాల నిర్మాణానికి అనువైన స్థ‌లం ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆ రెండు సంస్థ‌ల‌కు అప్ప‌గించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదివ‌ర‌కే టిటిడి నిర్మించిన 500 ఆల‌యాల్లో క‌ల్యాణోత్స‌వం ప్రాజెక్టు ద్వారా శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హించాల‌న్నారు.